అనంతపురం జిల్లాలో దారుణం - భార్య, తొమ్మిది నెలల చిన్నారిని హత్య చేసిన భర్త - father killed the daughter
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 10:34 PM IST
Husband Murdered His Wife and Daughter in Anantapur District : అనంతపురం జిల్లా యాడికి మండలంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య, తొమ్మిది నెలల కుమార్తెను భర్త హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్య చంద్రావతి, తొమ్మిది నెలల కుమార్తె చైత్రికను భర్త రామకృష్ణ హత్య చేయడంతో చౌడేశ్వరి కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. నిందితుడు రామకృష్ణ క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ, తీవ్రంగా అప్పులపాలయ్యాడు. దీంతో కుటుంబాన్ని పట్టించుకోవటం లేదంటూ రామకృష్ణను భార్య చంద్రావతి నిలదీశారని స్థానికులు తెలిపారు. ఈ విషయంపైనే నిన్న(గురువారం) రాత్రి భార్య, భర్తల మధ్య ఘర్షణ జరిగిందని వివరించారు.
ఈ నేపథ్యంలో ఈరోజు(శుక్రవారం) సాయంత్రం భార్య చంద్రావతి నిద్రలో ఉండగా చేతులు కట్టేసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చిన్న కుమార్తె చైత్రికపై బియ్యం మూట వేయడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణ చేశారు. భార్య, కుమార్తెను హత్యచేసి రామకృష్ణ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.