ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి క్వారీలో భారీ పేలుళ్లు - హడలిపోతున్న గ్రామస్థులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 8:02 PM IST
Huge Blast in MLA Kapu Ramachandra Reddy Quarry: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో నేమకల్లు కొండల్లో తెల్ల కంకర కోసం నిర్వాహకులు భారీ పేలుళ్లు నిర్వహించారు. దీంతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల మేరకు చిన్నపాటి పేలుళ్లతో క్వారీల్లో అనుమతులున్నట్లు గ్రామస్థులు తెలిపారు. బొమ్మనహల్ మండలంలో దాదాపు 18 తెల్ల కంకర క్వారీలు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మోహన్ దాస్ అనే మరో వ్యక్తి క్వారీల్లో మాత్రమే ఈ పనులు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
గ్రామంలో 10 ఇళ్లకు చీలికలు ఏర్పడగా రెండు బోరు బావులు మూతపడినట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో తాగునీటి సరఫరా ఆగిపోయినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. క్వారీల యజమానులు ఇష్టారాజ్యంగా భారీగా పేలుళ్లను నిర్వహించడంతో గ్రామం అల్లకల్లోలంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. క్వారీలో పేలుళ్ల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని నేమకల్లు, ఉంతకల్లు గ్రామాల ప్రజలు వెల్లడించారు. తమ జీవన విధానాలతో పాటు వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకంగా ఈ క్వారీ మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తెల్ల కంకర క్వారీల్లో పేలుళ్లను నియంత్రించాలని గ్రామస్థులు కోరుతున్నారు.