ప్రతి ఇంట్లో మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడాలి- కేంద్ర మంత్రి చంద్రశేఖర్్ - HAR GHAR TIRANGA - HAR GHAR TIRANGA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 11, 2024, 10:24 AM IST
Har Ghar Tiranga Program in AP : ప్రతి ఇంట్లో మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడాలని ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గుంటూరు కలెక్టరేట్ వద్ద పోస్ట్ ఆఫీసులో ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు.
Pemmasani on Har Ghar Tiranga : హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేపట్టారని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఇంట్లో జాతీయజెండా, సోషల్ మీడియాలో జాతీయపతాక ఫొటోను డీపీగా ఉంచుకోవాలని దీని ఉద్దేశమని చెప్పారు. తద్వారా ప్రజల్లో దేశభక్తి వస్తుందని దీనికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అందుకే ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని పెమ్మసాని పిలుపునిచ్చారు.
ప్రజల హృదయాలలో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడం, భారత జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం హర్ ఘర్ తిరంగా లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా యువజన సర్వీసుల శాఖ, క్రీడా ప్రాధికారిక సంస్థ, పర్యాటక శాఖ, నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. ఏడురోడ్ల కూడలి నుంచి కోడి రామ్మూర్తి క్రీడా మైదానం వరకు సాగిన ఈ ర్యాలీని గొండు శంకర్ జెండా ఊపి ప్రారంభించారు.