దళితులే లక్ష్యంగా దాడులు - వైఎస్సార్సీపీని గద్దె దించేవరకు పోరాటం ఆగదు: హర్షకుమార్ - Former MP GV Harsh Kumar
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 7:10 AM IST
GV Harsh Kumar Comments on YCP Government: వైసీపీ పాలనలో దళితులే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడి అవమానాలకు గురి చేస్తున్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. సీఎం జగన్‌కు దళితులంటే చిన్నచూపని, 27 ఎస్సీ పథకాలను రద్దు చేసి, సబ్‌ప్లాన్ నిధులు మళ్లించి, కార్పొరేషన్ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో దళితులంతా దగా పడ్డారని వాపోయారు. రాజమహేంద్రవరంలోని కడియం మండలం వేమగిరి వద్ద ఆదివారం సాయంత్రం నిర్వహించిన దళిత సింహగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ వైసీపీ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు.
ఈ సభ జగన్ అహంకారం, దళితుల ఆత్మగౌరవానికీ మధ్య జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు. దళితుల గుండె చప్పుడు వినిపించేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో పర్యటించి దళిత గర్జన సభలో తీర్మానం చేసిన విషయాలను ప్రజలకు వివరించి చైతన్య పరుస్తామన్నారు. దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు మాత్రం ఓటేయకండి అని హర్షకుమార్ పిలుపునిచ్చారు.