Doctor Traveling on A Bicycle in ongole: ఇప్పుడంటే సెల్ఫోన్లు, వీడియో గేమ్‌లు, స్పోర్ట్స్ సైకిళ్లు, బైకులు వచ్చాయి గానీ, 30 నుంచి 40 ఏళ్ల కిందట పిల్లల పరిస్థితి వేరు. కొద్దిసేపు పాటు సైకిల్‌ను అద్దెకు తీసుకుని మరీ సరదా తీర్చుకునేవారు. సొంతంగా సైకిల్ కొనుక్కోలేని అవకాశాల్లేక అద్దె సైకిళ్లపై ఆధారపడేవారు. కానీ, రోజులు మారిపోయాయి. కానీ నేడు తల్లిదండ్రులు వారి పిల్లలకు సైకిళ్లే కాదు స్పోర్ట్స్ బైకులు, కార్లను సైతం కొనేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనూ కొందరు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఒంగోలుకు చెందిన వైద్యుడు కొర్రపాటి సుధాకర్ పదిహేనేళ్లుగా సైకిల్‌పై ప్రయాణానికే ప్రాధాన్యమిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లతే
సైకిల్ తొక్కుతున్న డాక్టర్: ఒత్తిడిని జయించడానికి, శరీర వ్యాయామం, మైండ్ రీఫ్రెష్మెంట్ కోసం సైకిల్ ప్రయాణం దోహదపడుతుంది. వాహనాలను కొందరు సామాజిక హోదాకు చిహ్నాలుగా భావిస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా వినియోగించడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ తరహా తీరు పర్యావరణానికి చేటు చేస్తోందని ఒంగోలుకు చెందిన వైద్యుడు కొర్రపాటి సుధాకర్ భావించారు. చికిత్సను తన నుంచే ప్రారంభించాలనుకున్నారు. ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల ఇరవై కి.మీల వరకు ఏ చిన్న పని ఉన్నా గత పదిహేనేళ్లుగా సైకిల్‌పై ప్రయాణానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటి నుంచి రోజూ ఆసుపత్రికి కూడా ఇదే విధంగా ప్రయాణిస్తున్న చేస్తున్నారు.
ఇటీవల సంక్రాంతి పండగకు నగరం నుంచి 42 కి.మీ దూరంలో ఉన్న స్వగ్రామమైన తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలేనికి సైకిల్‌పై వెళ్లి వచ్చారు. 2016లో పురుడు పోసుకున్న ప్రకాశం గ్లోబల్ ఎన్నారై ఫోరమ్(పీజీఎన్‌ఎఫ్) అనే సంస్థకు ఈ వైద్యుడు కన్వీనర్‌గా ఉన్నారు. ఈ ప్రాంతానికి చెందిన వారు విదేశాల్లో స్థిరపడిన వారు 200 మంది వరకు ఇందులో సభ్యులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ సంస్థ తరఫున ఇప్పటికే సుమారు వెయ్యి వరకు సైకిళ్లను ఉచితంగా అందజేశారు. 170 ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు సైతం సమకూర్చారు.