రెండు గ్రూపుల మధ్య 'గ్యాంగ్ వార్'- కార్లతో ఢీకొట్టుకుని హల్‌చల్- పోలీసుల ఎంట్రీతో! - Gang War Viral Video
🎬 Watch Now: Feature Video
Published : May 25, 2024, 5:22 PM IST
Gang War In Udupi : కర్ణాటకలో కొందరు యువకులు రాత్రివేళ రోడ్డుపై హల్‌చల్ చేశారు. కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. మే 18న ఉడిపి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్ వార్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉడిపి టౌన్ పోలీసు పరిధిలోని కుంజిబెట్టు వద్ద రెండు కార్లలో వచ్చిన ఎనిమిది మంది యువకులు వీరంగం సృష్టించారు. మొదట ఓ కారు వేగంగా వెనక్కి వచ్చి మరో వాహనాన్ని ఢీకొట్టింది. అందులో నుంచి యువకులు దిగి కర్రలతో కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే కర్ర పట్టుకున్న ఓ యువకుడిని మరో గ్రూప్‌నకు చెందిన కారు ఢీకొనడడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడు.
అయితే గ్యాంగ్ వార్ వీడియో వైరల్ కావడం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు. ఆషిక్, రకీబ్, సక్లైన్ను అరెస్టు చేశారు. కత్తులు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ రెండు గ్రూప్‌ల మధ్య ఆర్థికపరమైన వివాదాలున్నాయని, దానివల్ల ఈ గొడవ జరిగిందని పోలీసులు వెల్లడించారు. వీరంతా గరుడ గ్రూప్‌నకు చెందినవారుగా తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కామనే!
మరోవైపు, ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. గ్యాంగ్ వార్ వీడియోను పోస్ట్ చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించింది. #CongressFailsKarnataka అనే హ్యాష్‌ట్యాగ్‌ను యాడ్ చేసింది. "కర్ణాటక మోడల్! గ్యాంగ్ వార్‌లు, యువతులపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, బాంబు పేలుళ్లు, గంజాయి, నల్లమందు, రేవ్ పార్టీలతో సహా పాకిస్థానీ జిందాబాద్ నినాదాలు మొదలైనవి కాంగ్రెస్ ప్రభుత్వంలో కామన్. ఉగ్రవాదులు, మతోన్మాదులు, దుండగులు, దుర్మార్గులకు సీఎం సిద్ధరామయ్య పూర్తి స్వేచ్ఛనిచ్చి పోలీసులను కీలుబొమ్మగా మార్చారు" అని బీజేపీ ఆరోపించింది.