జనసేన ఎంత మందికి టికెట్లు ఇవ్వాలో హరిరామజోగయ్య శాసించడం సరికాదు: ఓవీ రమణ - Ramana on Hari Rama Jogayya
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 5:36 PM IST
Ramana key comments on Hari Rama Jogayya: చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను ఓడించినపుడు మాజీ మంత్రి హరిరామజోగయ్యకు జాతి గుర్తు రాలేదా అని, మాజీ తితిదే ధర్మకర్తల మండలి సభ్యులు, కాపు నేత ఓవీ రమణ ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరిరామజోగయ్యపై ఓవీ రమణ మండిపడ్డారు. హరిరామజోగయ్యపై తమ స్వార్థం, ప్రలోభాల కోసం జాతిని తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాక హరిరామజోగయ్య వ్యాఖ్యలు సరికాదన్నారు.
గెలిచే వాళ్లకే టీడీపీ, జనసేన టికెట్లు ఇస్తారని ఆయన తెలిపారు. ఎంత మందికి టికెట్లు ఇవ్వాలో హరిరామజోగయ్య శాసించడం సరికాదని తెలిపారు. లేఖాస్త్రాలు సంధించడం మానుకోవాలని, కొందరి కుట్రలు, కుతంత్రాల ఉచ్చులో ఇరుక్కోవద్దని ఓవీ రమణ హితవు పలికారు. గతంలో ఓ నాయకుడు సైతం కాపులను ఉద్దరిస్తానంటూ వారిని బలిపశువులను చేశాడని పేర్కొన్నారు. హరిరామజోగయ్య ఎవ్వరి కోసమో పార్టీలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాపు ఓట్లను ప్రభావితం చేసే విధంగా సూచనలు ఇవ్వాలని, ఆందోళనకు దారితీసే చర్యలు మానుకోవాలని హితవు పలికారు.