పంటలు కాపాడుకునేందుకు అవస్థలు - ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్న రైతులు - MAHABUBABAD FARMERS PROBLEMS - MAHABUBABAD FARMERS PROBLEMS
🎬 Watch Now: Feature Video


Published : Sep 4, 2024, 1:36 PM IST
Farmers Facing Problems In Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కాలువలు, చెరువులు వరదనీటితో నిండిపోయాయి. పంటలను కాపాడుకునేందుకు కొత్తగూడెం మండలం ముస్మి గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రోజున వాన కాస్త తెరిపించడంతో సాయంకాలం సమయంలో పొలానికి వెళ్లారు. అయితే రాత్రి వాన కురవడంతో అక్కడే ఉన్నారు. ఇక ఇవాళ (బుధవారం) ఉదయం గ్రామానికి చేరుకునేందుకు పయనమయ్యారు. అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగు ఉ ద్ధృతంగా ప్రవహించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగును దాటారు. పంటలను అడవి పందులు, కోతుల నుంచి రక్షించుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఈ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి గతంలో మూడున్నర కోట్ల రూపాయలతో మంజూరైనప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలను కాపాడుకోవడం కోసం ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నా వాటి వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. లేదంటే అడవి దున్నలు పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వర్షాకాలంలో తమకు తిప్పలు తప్పట్లేదంటున్న రైతులు ఇప్పటికైనా అధికారులు వాగుపై వంతెన నిర్మించాలని వేడుకుంటున్నారు.