పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురి కంటే ఎక్కువగా గుమిగూడొద్దు : డీజీపీ రవిగుప్తా - LOK SABHA ELECTIONS 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : May 12, 2024, 9:58 PM IST
Telangana DGP Ravigupta Interview : పౌరులందరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రానికి పోలింగ్ కేంద్రాలను అనుసంధానించి, పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల కోసం 73,414 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రవి గుప్తా తెలిపారు. తెలంగాణలో 3 జిల్లాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయన్నారు. సదరు జిల్లాల్లో పెద్ద ఎత్తున పారా మిలిటరీ దళాలను మోహరించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, కేంద్రాల వద్ద ఐదుగురి కంటే ఎక్కువగా గుమిగూడవద్దని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.