ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్ సుధామూర్తికి నన్నయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ - రాజమహేంద్రవరంలో స్నాతకోత్సవం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 12:33 PM IST
Convocation in Adikavi Nannayya University: రాజమహేంద్రవరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో 13, 14, 15వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తిని గౌరవ డాక్టరేట్‌తో గవర్నర్ సత్కరించారు. నందమూరి లక్ష్మీ పార్వతికి డి-లిట్, సామాజిక రంగంలో పీహెచ్‌డీ చేసిన జక్కంపూడి విజయలక్ష్మికి బంగారు పతకం అందించారు. విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవిత నైపుణ్యాలతోపాటు సాంకేతిక నైపుణ్యాలను మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మార్చుకోవాలన్నారు.
దేశంలో 900కు పైగా వర్సిటీలు, 4వేల కళాశాలలు ఉన్నప్పటికీ ప్రవేశాల నిష్పత్తి 27.29 శాతమేనని అన్నారు. 2035 నాటికి 50 శాతానికి పైగా తీసుకువెళ్లడమే నూతన విద్యావిధాన లక్ష్యమని పేర్కొన్నారు. మాజీ నేవీ రియర్ అడ్మిరల్ ఎస్.వెంకట శేషాచారి మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా చరిత్ర సృష్టించేవారు కావాలన్నారు. దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితులు, రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయిల్- హమాస్‌ల వివాదాలు కొనసాగే అవకాశాలు ఉన్నందున మనదేశం తయారీ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలుగులోకి తేవడానికి ఇదొక గొప్ప అవకాశమని శేషాచారి అన్నారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి మాట్లాడుతూ కళాశాల జీవితానికి, బాహ్య ప్రపంచానికి చాలా వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. ప్రతి రోజూ పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వీటిలో ఉత్తీర్ణులయ్యేందుకు సిలబస్, ఉపాధ్యాయులు ఉండరని, అనుభవంతోనే ఎదుర్కోగలమని ఆమె అన్నారు. జీవితంలో అమ్మ ప్రేమ తప్ప ఏదీ ఉచితంగా లభించదని పేర్కొన్నారు. కష్టపడేతత్వం, సాధించాలనే తపన ఉంటేనే విజయాలు అందుకోగలరని విద్యార్థులకు స్ఫూర్తిని తెలియజేశారు. మాతృభాషను దేశాన్ని నిత్యం ప్రేమిస్తూ రోజూ కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు.