రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు- జాప్యం లేకుండా ఫలితాలు : సీఈవో మీనా - CEO Mukesh Kumar Meena Inspected
🎬 Watch Now: Feature Video
CEO Mukesh Kumar Meena Inspected : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం నోవా, నిమ్రా కళాశాలల్లో కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లను కలెక్టర్ డిల్లీరావు, పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను కలెక్టర్ మీనాకు వివరించారు. కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులతో పాటు దాదాపు 500 మంది ఇతర సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్లు సీఈఓ పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల్లోని ఓట్లను లెక్కించే ప్రక్రియలో భాగస్వాములు కానున్న సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ వివరించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖేష్ కుమార్ మీనా పలు సూచనలు చేశారు. అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు తదితరులకు చేయాల్సిన ఏర్పాట్లు సహా భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశనం చేశారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు, జాప్యం లేకుండా ఫలితాల వెల్లడికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.