టీటీడీలో జరిగిన కమిషన్ల వ్యవహారాలపై దర్యాప్తు జరిపించాలి: బీజేపీ - TTD Commission Affairs
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 2, 2024, 10:36 PM IST
BJP Leader Srinivas on Investigate Commission Affairs Held in TTD: గత ఐదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కమిషన్ల వ్యవహారాలపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శ్రీవారి ఆస్తులను తిరిగి హుండీలోకి వచ్చేలా చూడాలన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో టీటీడీ ధార్మిక సంస్థలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. టీటీడీలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగి రవికుమార్‌కు ఏకంగా రూ.150 కోట్ల ఆస్తులను ఎలా కూడబెట్టారని శ్రీనివాస్ అన్నారు. సాక్షాలతో సహా ఈ విషయం వెలుగులోకి వస్తే గత ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం రాజీ మార్గంలో కేసు ముగించిందని ఆయన విమర్శించారు.
శ్రీవారి హుండీలో భక్తులు కానుకల రూపంలో వేసిన కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ నోట్లను రవికుమార్ దొంగిలించడం విజిలెన్స్ తనిఖీలో బయటపడిందని వివరించారు. అప్పట్లో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మాధికారి, ఎస్పీ, సీఐ తదితరులు కొన్ని ఆస్తులను రవికుమార్ ద్వారా వారి ఖాతాలకు మళ్లించుకున్నారని విమర్శించారు. రవికుమార్‌కు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. టీటీడీలో అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.