20వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులను ఉచిత పథకాలకు మళ్లించుకున్నారు: బీజేపీ నేత సత్యకుమార్
🎬 Watch Now: Feature Video
BJP leader Sathya Kumar: రాష్ట్ర ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులు 20వేల కోట్ల రూపాయలను ఉచిత పథకాలకు మళ్లించిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. విశాఖ జిల్లా భీమిలీలో బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో ఉన్న పథకాలను రద్దుచేసి ఉన్న పథకాలలో సగం వాటికే ఖర్చుపెట్టి మిగతా సగభాగం రాష్ట్రం మింగేస్తే దళితుల బతుకుల్లో వెలుగులు ఎలా వస్తాయని సత్యకుమార్ ప్రశ్నించారు.
దళితుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలో దేశవ్యాప్తంగా నాలుగు లక్షల అరవై వేల కోట్ల రూపాయల ఖర్చు చేసిందని సత్యకుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మాతృ వందనం, సుకన్య సమృద్ధి యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, అటల్ పెన్షన్ యోజన పేరిట సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వంలోని వ్యక్తుల పేరుతో ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి సంజీవయ్య, బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.