ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో బాధితులకు అదనపు పరిహారం - 2 విడతల్లో రూ. 120 కోట్లు - Compensation to LG Polymers victims
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2024, 9:09 PM IST
Additional Compensation to LG Polymers Accident Victims: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు అదనపు పరిహారం అందించేందుకు ఆ సంస్థ యాజమాన్యం ముందుకు వచ్చింది. మెుదటి విడత సహాయంగా 60 కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రకటించిందని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో ఎల్జీ పాలిమర్స్ పరిహారంపై నిర్వహించిన సమావేశంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, ఎల్జీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 2020లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ గ్యాస్ లీక్ అయ్యి 12 మంది ప్రాణాలు కొల్పోయారు.
ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రెండు విడతల్లో 120 కోట్ల రూపాయలు పరిహారంగా ఎల్జీ పాలిమర్స్ అందిస్తోందని ఆ సంస్థ ప్రతినిధి పాల్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఫౌండేషన్ ద్వారా పర్యావరణం, తాగు నీరు, వైద్యం తదితరాలపై దృష్టి పెట్టామని తెలిపారు. స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సహకారంతో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారం రోజుల్లోగా కలెక్టర్ చేతుల మీదుగా బాధితులకు పరిహారం అందజేసేలా ప్రణాళిక సిద్ధం చేసామని పాల్ తెలిపారు.