Why Your WhatsApp Gets Hacked : వాట్సాప్ మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. సులువుగా, త్వరగా మెసేజ్‌లు పంపడానికి, స్వీకరించడానికి వీలుగా ఉండడమే ఇందుకు కారణం. వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. కనుక మీ మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు సురక్షితంగా ఉంటాయని వాట్సాప్ చెబుతోంది. ఇది కొంత వరకు వాస్తవమే. అయినప్పటికీ కొన్ని సార్లు మన వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయిపోతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- టూ-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి : మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే దానికి 'పిన్' సెట్ చేసుకోవడం చాలా మంచిది. దీనితోపాటు టూ-స్టెప్ వెరిఫికేషన్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. దీని వల్ల మీ వాట్సాప్ ఖాతాకు అదనపు రక్షణ ఏర్పడుతుంది. అయితే ఈ పిన్ను, టూ-స్టెప్ వెరిఫికేషన్ కోసం వచ్చే ఓటీపీని ఎవరికీ, ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఒక వేళ ఇవి వేరేవాళ్లకు తెలిస్తే, మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
- రిజిస్ట్రేషన్ కోడ్ షేర్ చేయకూడదు : అప్పుడప్పుడు మనం ఇతరుల ల్యాప్‌టాప్, డెస్క్టాప్ల్లో వాట్సాప్‌ను వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా కొత్త డివైజ్‌ల్లో మీరు వాట్సాప్ వాడినప్పుడు, మీ మొబైల్ నంబర్‌కు ఒక రిజిస్ట్రేషన్ కోడ్ వస్తుంది. దీనిని మీరు చాలా సీక్రెట్‌గా ఉంచాలి. ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ కోడ్ ఇతరుల చేతికి చిక్కితే, వాళ్ల చేతిలోకి మీ వాట్సాప్ అకౌంట్ వెళ్లిపోతుంది. కనుక వాళ్లు మీ ప్రమేయం లేకుండా మీ ఖాతా నుంచి మెసేజ్‌లు పంపడానికి, స్వీకరించడానికి వీలవుతుంది. అంతేకాదు మీ విలువైన డేటాను తస్కరించడానికి, దానిని దుర్వినియోగం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.
- అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదు : హ్యాకర్లు మీ వాట్సాప్‌నకు, ఈ-మెయిల్స్‌కు ఫిషింగ్ లింక్స్ పంపిస్తూ ఉంటారు. వీటిని పొరపాటున కూడా క్లిక్ చేయకూడదు. ఒకవేళ వీటిపై క్లిక్ చేస్తే, మీ డివైజ్ మొత్తం వారి కంట్రోల్లోకి వెళ్లిపోతుంది. దీనితోపాటు మీ వాట్సాప్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కనుక వాట్సాప్ వాడేటప్పుడు అన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి. అప్పుడే మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉంటుంది.