Sun To Earth Light Time : సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అని ప్రశ్న వేస్తే కచ్చితంగా 8 నిమిషాల 20 సెకన్లు అని సమాధానం చెబుతాం. కానీ సూర్యుడి నుంచి కాంతి భూమికి చేరుకోవడానికి పట్టే కచ్చితమైన సమయం ఇది కాదట. అదేంటో ఓ సారి తెలుసుకుందాం.
సూర్యుడు, భూమికి మధ్య దూరం సుమారు 150 మిలియన్ కిలోమీటర్లు. ఈ లెక్కను బట్టి సూర్యుడి నుంచి కాంతి భూమికి చేరుకోవడానికి 500 సెకన్లు లేదా ఎనిమిది నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది. అయితే సూర్యుని చుట్టూ భూకక్ష్య సంపూర్ణ వృత్తాకారంలో కాకుండా కొద్దిగా దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. కాబట్టి భూమి, సూర్యుడికి మధ్య అసలు దూరం దాదాపు 147-152 మిలియన్ కిలోమీటర్ల వరకు ఉంటుంది. కాబట్టి సూర్యుని నుంచి భూమికి కాంతి వాస్తవ ప్రయాణ సమయం 490 నుంచి 507 సెకన్ల వరకు ఉండొచ్చు లేదా 8 నిమిషాల 10 సెకన్ల నుంచి 8 నిమిషాల 27 సెకన్ల వరకు ఉండవచ్చు. కాంతి ఫోటాన్‌లు, సూర్యుని ఉపరితలం వద్ద ఏర్పడలేదు. అవి నక్షత్రం లోపల లోతుగా ఉన్నాయి. అవి భూమికి చేరుకోవడానికి ప్రయాణాన్ని ప్రారంభించే ముందు సూర్యుని ఉపరితలం చేరుకోవడానికి వేల ఏళ్లు పట్టవచ్చు.
రికార్డ్ సృష్టించిన దక్షిణ కొరియా 'సూర్యుడు'
దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడు కొన్నాళ్ల క్రితం సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు! 20 సెకండ్ల పాటు ఏకంగా 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జ్వలించాడు. కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యుజన్ ఎనర్జీ, సియోల్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించిన ఈ కృత్రిమ సూర్యుడి పేర కె-స్టార్(ది కొరియా సూపర్ కండక్టింగ్ టొకమాక్ అడ్వాన్స్డ్ రీసెర్జ్). 2008లోనే తొలిసారిగా ఇది సంచలనం సృష్టించింది.
అదే లక్ష్యం
అయితే 2025 నాటికి దీన్ని కనీసం 300 సెకండ్ల పాటు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచాలన్నది పరిశోధకుల లక్ష్యం. ఈ దిశగా సూర్యుని మాదిరే కె-స్టార్‌లోనూ వారు జ్వలన(ఫ్యుజన్) ప్రతిస్పందనలను కలిగిస్తున్నారు. దీని కోసం వారు హైడ్రోజన్ నుంచి ప్లాస్మాను సేకరించారు. ఇందులో 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడిన ఆయాన్లు ఉంటాయి. ఫ్యుజన్ రియాక్టర్ సాయంతో ఆయాన్లను అధిక వేడిలో ఉంచడం ద్వారా ప్లాస్మా 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 20 సెకండ్ల పాటు కొనసాగేలా పరిశోధకులు విజయం సాధించారు.