Space Explorations 2024 : అరుణ గ్రహంపై విస్తారంగా ఉన్న మంచు నిక్షేపాలను కనుగొనడం దగ్గరి నుంచి స్వయం ప్రతిపత్తి సాంకేతిక పరికరాలతో సుదూర విశ్వాంతరాల పరిశోధనల వరకు 2024లో మానవాళి ఎన్నో సాహసోపేతమైన అడుగులేసింది. వివిధ సంస్థలు, దేశాలు చంద్రునిపై రోబోలు, ల్యాండర్లను దించేందుకు యత్నించగా కొన్నివిజయం సాధించాయి. జనవరి నెలలో యూరోపియన్ స్పేస్‌ఏజెన్సీ-ESAకి చెందిన మార్స్‌ఎక్స్‌ప్రెస్ ఆర్బిటర్ అరుణుడి ఉపరితలం లోపలిపొరలో ఏకంగా 3.7 కిలోమీటర్ల మందంతో భారీగా మంచు నిక్షేపాలను గుర్తించింది. దాన్ని కరిగిస్తే గ్రహం మొత్తం 2మీటర్ల మందమైన నీటిపొర సృష్టించగలమని శాస్త్రవేత్తలు తెలిపారు. అంగారకుడి ధ్రువ ప్రాంతాల్లో కాకుండా మధ్యరేఖా ప్రాంతంలో ఆ నిల్వలను గుర్తించడం గమనార్హం.
ఎయిర్‌బస్ అటోనమస్ రోవర్
2024 సెప్టెంబరులో ఎయిర్‌బస్ సంస్థ పూర్తి స్వయంప్రతిపత్తి గల రోవర్‌ను పరీక్షించింది. మార్స్‌పై ఉండే వాతావరణాన్ని ఇంగ్లాండ్‌లోని ఓ ఇసుక క్వారీలో సృష్టించి ఆ రోవర్ సామర్థ్యాన్ని పరిశీలించింది. నమూనాల సేకరణ, నావిగేషన్, లొకేషన్ వంటి మిషన్‌లను అది సొంతంగా నిర్వహించింది. 2028లో ESA చేపట్టే ఎక్సో మార్స్ రోవర్ ప్రయోగానికి ఈ పరిశోధన ఎంతో కీలకం కానుంది.
అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్ గుర్తింపు
విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన J0529-4351 అనే క్వాసార్‌ను 2024 ఫిబ్రవరిలోనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూర్యుడి కన్నా 17వందల కోట్ల రెట్లు ద్రవ్యరాశి కలిగిన సూపర్ మాసీవ్ కృష్ణబిలం ద్వారా ఆ క్వాసార్‌కు శక్తి లభిస్తోందనీ,. మన సూర్యుడి కన్నా 500 లక్షల కోట్ల రెట్లు ఆ క్వాసార్ ప్రకాశవంతమైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
స్పేస్ ఎక్స్ ల్యూనార్ ల్యాండర్
ఇక ఫిబ్రవరిలోనే కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి దూసుకెళ్లిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ నాసాకు చెందిన ఓ ల్యూనార్ ల్యాండర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలిసారి మానవుడిని దించేందుకు ఈ మిషన్ కీలకమని నాసా తెలిపింది. బృహస్పతి ఉపగ్రహం యూరోపా ఉపరితలంపై గతంలో అనుకున్నదానికన్నా తక్కువ ఆక్సిజన్ ఉన్నట్లు నాసాకు చెందిన జూనో స్పేస్‌క్రాఫ్ట్ నిర్ధరించింది. యూరోపాలో మహా సముద్రం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తక్కువ ఆక్సిజన్ స్థాయిలు ఉన్నా అక్కడి మంచులో సూక్ష్మజీవులు వృద్ధి చెందగలవని చెబుతున్నారు.
నాసా రీ-కమ్యూనికేషన్ ఫీట్
2023 నవంబర్‌లో వాయేజర్-1 సాంకేతికలోపం వల్ల నాసా సంబంధాలు కోల్పోయింది. అనేక ట్రబుల్‌షూట్ల తర్వాత 2024 ఏప్రిల్‌లో భూమికి 15వందల కోట్ల మైళ్ల సుదూరంలో ఉన్న వాయేజర్-1తో నాసా తిరిగి కమ్యూనికేషన్ నెలకొల్పగలిగింది.
అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్!
మార్చిలో జీనెట్ ఎప్స్, మిచేల్ బర్రాట్ట్ అనే నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు ఆరు నెలల అంతరిక్షయానం కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్- ISSకు వెళ్లారు. అటు ఆగస్టులో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా 8రోజుల మిషన్‌లో భాగంగా ISSకు వెళ్లిన బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. స్టార్‌లైనర్‌లో సాంకేతికత సమస్యలు రావడం వల్ల వారు ISSలోనే ఉండియారు. అంతా చక్కబడితే ఫిబ్రవరి 2025లో వారు భూమికి తిరిగివస్తారు. అంటే 8రోజులు అనుకున్న మిషన్ 8నెలలు పట్టేలా ఉంది.
జేమ్స్‌వెబ్ టెలిస్కోప్ కొత్త ఫైండింగ్స్
అంతరిక్షంలో ప్రయాణించే అతిపెద్ద టెలిస్కోప్ జేమ్స్‌వెబ్ అక్టోబరులో ప్లూటోకు చెందిన అతిపెద్ద చంద్రుడు చరోన్‌పై కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ మూలకాలను కనుగొంది. సూర్యుని నుంచి 3 వందల కోట్ల మైళ్ల దూరంలో ఉన్న కైపర్ బెల్ట్‌లోని మంచు నిక్షేపాల చిత్రాలను సైతం జేమ్స్ వెబ్ మానవాళికి పంపించింది.