Artificial Intelligence Innovations: వెలుతురు కోసం బల్బుల అవసరం లేకుండానే.. తక్కువ ఇంధనంతో పనిచేసే పరికరాలు రాబోతున్నాయి. వీటి ద్వారా గోడలే వెలిగిపోతాయి. అంతేనా ఇంట్లో అక్కడక్కడా ఉన్న సెన్సర్లు ఇంట్లోని వ్యక్తుల ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంటాయి. ఏం కావాలో చెబితే చాలు.. AIతో అనుసంధానమైన రోబోలు చకచకా వండేస్తాయి. ఇంకా వంటగదిని శుభ్రం చేసి పెడతాయి. ఇదంతా సినిమాటిక్‌గా అనిపిస్తున్నా మరికొన్ని సంవత్సరాలలో రాబోతున్న స్మార్ట్ ఇళ్లలో.. రోజూ కన్పించే దృశ్యాలు ఇవే.
ఆధునిక సాంకేతికత కారణంగా బల్బుల నుంచి గోడల దాకా ఇళ్లన్నీ ఇంటర్నెట్ ఆధారిత సెన్సర్లు, పరికరాలతో స్మార్ట్‌గా మారిపోబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) తదితరాల్లో వేగవంతమవుతున్న పరిశోధనల ఫలితంగా.. మన ఇంట్లోని వస్తువులు యజమానుల, వినియోగదారుల అవసరాలు, అలవాట్లను అర్థం చేసుకొని... తదనుగుణంగా జీవనాన్ని స్మార్ట్‌గా మారుస్తున్నాయి. ఇంటిని శుభ్రం చేసుకోవటం, వంట వండటంలోనూ యంత్రాలు ఉపయోగపడే కాలం వచ్చేసింది. వీటన్నింటికి మించి.. ఇంట్లో అమర్చిన సెన్సర్లు మన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి. డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ మనల్ని అప్రమత్తం చేస్తుంటాయి. అవసరమైన సాయం చేస్తుంటాయి. ఇక బాత్‌రూమ్‌లోని సెన్సర్లు.. మలమూత్రాల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తునే ఉంటాయి. ప్రత్యేకంగా బయటికెళ్లి పరీక్షించాల్సిన అవసరం లేకుండానే! మందులు సరిపోయేన్ని ఉన్నాయో లేదో... సరిగ్గా సమయానికి వేసుకుంటున్నారో లేదో అప్రమత్తం చేస్తుంటాయి.
పరిశోధనల్లో కంపెనీలు: పూర్తిగా కాకపోయినా.. ఇప్పటికే అనేక ఐఓటీ ఆధారిత స్మార్ట్ గాడ్జెట్లు ఇళ్లలోకి ప్రవేశించాయి. ఐఓటీ ఆధారిత సాకెట్‌లతో ఫోన్‌లోని యాప్‌ల ద్వారా ఇంట్లో ఎలక్ట్రిక్ పరికరాలను ఆన్ ఆఫ్ చేసుకునే వీలు ఏర్పడుతోంది. తక్కువస్థాయిలో ఉన్న ఈ సౌకర్యాలను విస్తృతం చేసి... ఇల్లు మొత్తాన్ని ఇంటర్నెట్‌తో అనుసంధానించేలా సరికొత్త పరికరాల తయారీలో విశ్వవిఖ్యాత కంపెనీలన్నీ పరిశోధనల్లో మునిగితేలుతున్నాయి.
స్మార్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ రూమ్‌బా-లాంటివి ఇప్పటికే ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఐబో అనే కంపెనీ రోబో కుక్కలనూ తయారు చేస్తోంది. సోఫాలు, కుర్చీలు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా.. మన అవసరాలకు తగ్గట్లు మారేలా.. ఓరి లివింగ్ రోబోటిక్ ఫర్నిచర్ అందుబాటులోకి వస్తోంది. వంట చేసి పెట్టే రోబోటిక్ చేతుల కోసం.. ఎన్విడియా కంపెనీ ప్రయత్నిస్తోంది.
'ఏఐలో 12.5 లక్షల ఉద్యోగాలు'- ఈ స్కిల్స్ నేర్చుకో జాబ్ పట్టుకో!
అప్పటికి 28శాతం: విద్యుత్ వినియోగం కుదింపు, రిమోట్‌తో కంట్రోల్ చేసుకునే వీలుండటం, పెరిగే సౌకర్యాలు.. చాలా మందిని స్మార్ట్ హోమ్స్ దిశగా ఆకర్షిస్తున్నాయి. భారత్‌లో ఇప్పటికే స్మార్ట్ హోమ్ పరికరాల వినియోగం 10శాతం దాకా ఉందంటున్నారు నిపుణులు. కరోనా తర్వాత పరిస్థితులకు తోడు, ప్రభుత్వం డిజిటలైజేషన్‌ను ప్రోత్సహిస్తుండటం, భారత్‌లోకి విదేశీ బ్రాండ్లు కూడా వచ్చిపడుతుండటంతో 2025 నాటికి వీటి వినియోగం 28శాతానికి చేరుకుంటుందని అంచనా!
అయితే.. ఈ ధరలు మాత్రం ప్రస్తుతానికి ఎక్కువగానే ఉండటం మధ్యతరగతికి కాసింత నిరాశ కల్గించేదే అయినా.. వేగవంతమైన పరిశోధనలతో త్వరలోనే స్మార్ట్ పరికరాలూ అందుబాటు ధరల్లోకి వచ్చేసే అవకాశం ఉంది! ఇళ్లలో స్మార్ట్ పరికరాల అమరిక ఇల్లు మొత్తం కట్టాక కాదు.. మొదటి దశ నుంచే వీటి ప్రణాళికా మొదలువుతుంది. ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ, ఎయిర్‌కండీషనింగ్‌ల మాదిరిగా.. స్మార్ట్ టెక్ కూడా ఇంటి నిర్మాణ ప్రారంభంలోనే కీలక భాగమైపోతుంది.
మరికొన్ని:
డిస్ కనెక్ట్ గది.. ఇలా ఇల్లంతా ఒకెత్తైతే... ఓ గది మాత్రం ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. అదే డిస్ కనెక్ట్ గది. అక్కడ వైర్‌లెస్ సిగ్నళ్లుగానీ ఎలాంటి ఇంటర్నెట్‌గానీ పనిచేయదు.
మారిపోయే ఫర్నిచర్: సాధారణంగా కుర్చీలు, సోఫాలు, బెడ్లు.. వాడినా వాడకున్నా అవి ఎప్పడూ ఒకేచోట ఉంటాయి. కానీ స్మార్ట్ ఇళ్లలో ఎప్పుడూ ఒకేచోట ఉండవు. అవసరమైనట్లు మార్చుకోవచ్చు. పడుకోనప్పుడు బెడ్ అలా పైకి లేచి పైకప్పును పట్టుకుని ఉంటుంది. కిందంతా ఖాళీ ప్లేస్!
మైక్రోఫోన్లు: ఇంట్లో ఎక్కడున్నా.. నోటి మాటతో పనులు చేసుకునే వెసులుబాటు.
చూడాలంటేనే టీవీ: మామూలుగా టీవీ చూసినా చూడకపోయినా గోడకు టీవీ ఉంటుంది. కానీ ఈ స్మార్ట్ ఇళ్లలో చూడనప్పుడు గోడకు టీవీ ఉండదు. చూడటం కాగానే ముడుచుకుపోతాయి అతిపల్చని హెచ్‌డీ టీవీలు.
ఇన్‌స్టాలో మీ కంటెంట్‌కు ఎక్కువ వ్యూస్ రావాలా? ఈ టాప్ AI ఇన్ఫోగ్రాఫిక్స్ టూల్స్ ట్రై చేయండి!
30 ఏళ్ల కిందటే బిల్‌గేట్స్: ప్రపంచమంతా ఇప్పుడు ఊహిస్తున్న స్మార్ట్‌హోంను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సుమారు 30 సంవత్సరాల క్రితమే వాస్తవం చేసి చూపించారు. టెక్నాలజీలో ముందుచూపును, తన ఆధిపత్యాన్ని తన ఇంటి నుంచే మొదలెట్టారాయన. 1997లోనే xanadu 2.0 పేరుతో అమెరికాలోని లేక్ వాషింగ్టన్ ఒడ్డున గేట్స్ కట్టించిన భవంతిని భూమి మీద సాంకేతికంగా, సౌకర్యాల పరంగా అద్భుత కళాసౌధంగా అభివర్ణిస్తారు. ఇంటిని పూర్తిగా హైటెక్ హంగులతో నిర్మించినా.. ఆ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా మేజిక్ చేశారు. ఇల్లంతటినీ అప్పుడే ఫైబర్‌ఆప్టిక్ కేబుల్స్‌తో, సెన్సార్లతో అనుసంధానించారు. వెలుతురు, ఉష్ణోగ్రత, మ్యూజిక్‌లను నియంత్రించుకోవటానికి వీలుగా ప్రతిగది, గోడకు టచ్‌ప్యాడ్ ఉంది.
ఇంటికి వెళితే... అతిథి దుస్తులకు ఓ ఎలక్ట్రానిక్ పిన్ తగిలిస్తారు. దాంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులతో ఆ అతిథి అనుసంధానమైపోతారు. ఇంట్లో ఏదెక్కడుందో చెప్పటంతోపాటు... ఇష్టాయిష్టాలను కూడా అది తెలుసుకుంటుంది. తదనుగుణంగా అతిథికి ఇష్టమైన మ్యూజిక్ వస్తుంటుంది. ఇష్టమైన పెయింటింగ్స్ గోడలపై వేలాడుతుంటాయి. ఎప్పటి నుంచో ఉన్నట్లుగా భ్రమింపజేసే అవి అతిథి వెళ్లగానే మాయమైపోతాయి. కేవలం మనుషులకే కాదు.. ఇంట్లోని చెట్లకూ సాంకేతికను అద్దారు. వాటినీ సెన్సర్లకు, కంప్యూటర్లకు అనుసంధానించారు. చెట్లకు ఎంత నీరు అవసరమో, ఎప్పుడు అవసరమో ఎవ్వరూ చూడనక్కర్లేదు. అవసరాన్ని బట్టి టెక్నాలజీయే అంతా చూసుకుంటుంది. భూగోళంపై ప్రకృతిసిద్ధమైన చల్లని ప్రదేశం ఇది అంటారు గేట్స్! "ఓ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా ఇంట్లోని సౌకర్యాలు చాలామంది ఇళ్లలో వచ్చేస్తాయి. అంతకంటే మెరుగైనవీ రావొచ్చు" అంటూ 1996లోనే బిల్‌గేట్స్ రాసుకున్నారు.
త‘స్మార్ట్’జాగ్రత్త: ఈ స్మార్ట్ పరికరాలతో సౌకర్యాలతో పాటు.. ప్రమాదమూ పొంచి ఉంది. అదే సైబర్ సెక్యూరిటీ! కెమెరాలు, సెన్సర్లలాంటి పరికరాలతో.. హ్యాకర్లూ ఇంట్లోకి సులభంగా దూరిపోయే అవకాశాలు లేకపోలేదు. సెన్సర్లలో రికార్డయ్యే డేటాను కాపాడుకోవటం ఓ సవాలు. కాబట్టి.. స్మార్ట్ ఇళ్ల సక్సెస్ అంతా.. ఈ గాడ్జెట్ల తయారీలో సైబర్ భద్రతకిచ్చే ప్రాధాన్యతను బట్టి ఉంటుందన్నది నిపుణుల మాట!
శత్రువులను ఖతం చేసే 'AI రోబో'- ఎనిమీ ఎక్కడ ఉన్నా గురితప్పదు! యుద్ధభూమిలో 360 డిగ్రీల కవరేజ్!