ISRO Proba 3 Launch Success: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రోబా-3 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C59/PROBA-3 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
ప్రోబా-3 మిషన్‌లో భాగంగా సుమారు 550 కిలోల బరువున్న రెండు ఉపగ్రహాలను PSLV-C59 వాహకనౌక మోసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఈ మేరకు ప్రయోగం విజయవంతంపై శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ప్రయోగం ఎందుకంటే?: సూర్యుడి బయటి పొర అయిన కరోనాను అధ్యయనం చేసేందుకు 'పీఎస్‌ఎల్‌వీ-సీ59/ప్రోబా-3' మిషన్‌ను చేపట్టారు. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అభివృద్ధి చేసింది. ఈ మిషన్‌లో.. కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ (CSC), ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ (OSC) అనే రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటిని 'స్టాక్డ్ కాన్ఫిగరేషన్'లో అంటే ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటినీ కలిపి ఒకేసారి లాంఛ్ చేశారు.
ఈ రెండు శాటిలైట్లను ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా ప్రయోగించారు. 'ప్రోబా-3' మిషన్‌లో భాగంగా 'PSLV-XL' రాకెట్ రెండు ఉపగ్రహాలను సరైన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం ఈ రెండు శాటిలైట్లు పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో సూర్యుని చుట్టూ భూకక్ష్యలో తిరగనున్నాయి.
👏 Celebrating Success!
— ISRO (@isro) December 5, 2024
The PSLV-C59/PROBA-3 Mission reflects the dedication of NSIL, ISRO and ESA teams. This achievement highlights India’s critical role in enabling global space innovation.
🌍 Together, we continue building bridges in international space collaboration! 🚀✨…
సాధారణంగా సూర్యుని ప్రచండ వెలుగుల మధ్య కరోనా పొరను గమనించడం చాలా కష్టం. ఎందుకంటే సూర్యుని ప్రకాశం.. కరోనా బ్రైట్ పాయింట్ కంటే మిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది టెలిస్కోప్‌ను బ్లైండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యగ్రహణం కోసం పరిస్థితులను సిద్ధం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
ఈ మిషన్‌లో భాగంగా ప్రయోగించిన రెండు ఉపగ్రహాల ద్వారా కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించనున్నారు. తద్వారా శాస్త్రవేత్తలు సూర్యుని కరోనా పొరపై లోతైన అధ్యయనం చేయనున్నారు. ఈ అద్భుత ప్రయోగంలో ఇస్రో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
"పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం విజయవంతమైంది. ప్రోబా-3 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగలిగాం. ప్రోబా తదుపరి చేపట్టే ప్రయోగాలకు శుభాకాంక్షలు. ఎన్‌ఎస్‌ఐఎల్ భాగస్వామ్యంతో ప్రయోగం చేపట్టాం. పీఎస్‌ఎల్‌వీకి మరిన్ని అవకాశాలు కల్పించిన ఎన్‌ఎస్‌ఐఎల్‌కు ధన్యవాదాలు." - సోమనాథ్, ఇస్రో ఛైర్మన్
ఇస్రో మరో అద్భుత ప్రయోగం.. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే.. కౌంట్‌డౌన్ స్టార్ట్..!
ఎన్నో రహస్యాలు.. ఛేదించే పనిలో 'ప్రోబా-3'.. ఇది కృత్రిమ సూర్యగ్రహణాన్ని ఎలా సృష్టిస్తుందో తెలుసా?