ISRO Depended On SpaceX : దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలను అందించే లక్ష్యంతో ఇస్రో రూపొందించిన జీశాట్-ఎన్2 ఉపగ్రహ ప్రయోగంపై ఇస్రో మాజీ అధిపతులు కీలక వ్యాఖ్యలు చేశారు. 4000 కిలోలకుపైగా బరువున్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లే సామర్థ్యం మన రాకెట్లకు లేకపోవడం వల్లే స్పేస్ ఎక్స్ ద్వారా జీశాట్-ఎన్2 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించిందని పేర్కొన్నారు.
"ఇస్రో ప్రయోగ వాహనాల సామర్థ్యాన్ని మించి జీశాట్-ఎన్2 ఉపగ్రహం బరువు ఉంది. అందుకే దీన్ని ఇస్రో ద్వారా కాకుండా స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయోగించారు. ఇస్రోలో ఉన్న రాకెట్లు 4వేల కిలోల బరువున్న ఉపగ్రహన్ని మోసుకెళ్లగలవు. కానీ జీశాట్-ఎన్2 బరువు 4700 కిలోలు. ఇస్రో రాకెట్ సామర్థ్యాలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆ దిశగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. జీశాట్-ఎన్2 దేశానికి హై బ్యాండ్ కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. ఇది దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అందిస్తుంది" అని ఇస్రో మాజీ ఛైర్మన్ కే. శివన్ తెలిపారు.
'అందుకే అక్కడ నుంచే ప్రయోగం'
4.7 టన్నుల ఉపగ్రహాన్ని మోసుకెళ్లే పెద్ద ప్రయోగ వాహనం భారత్‌లో లేదని ఇస్రో మాజీ చీఫ్ జీ.మాధవన్ నాయర్ తెలిపారు. అందుకే జీశాట్-2 ఉపగ్రహాన్ని భారత్ స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయోగించిందని పేర్కొన్నారు. ఇస్రో తన తదుపరి జనరేషన్ వాహనాల సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి ప్రణాళికలు వేస్తోందని వెల్లడించారు. అంతవేరకు వేచిఉండడం కుదరక జీశాట్-ఎన్2 ఉపగ్రహ ప్రయోగానికి స్పేస్ ఎక్స్‌ను ఎంచుకున్నామని తెలిపారు.
నింగిలోకి దూసుకెళ్లిన ఉపగ్రహం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-ఎన్2 మంగళవారం నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. అనంతరం హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకోనుంది.
4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడం వల్ల స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. జీశాట్ ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్ ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా అడ్వాన్స్ డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది.