How To Track Lost Phone : స్విఛ్ ఆఫ్ అయిన స్మార్ట్‌ఫోన్ లొకేషన్‌ను కచ్చితత్వంతో తెలుసుకోవడం అనేది సాంకేతికంగా అసాధ్యం. కానీ ఫోన్ స్విచ్ఛాప్ అయ్యే సమయానికి ఉన్న లొకేషన్‌ను గుర్తించగలిగే టెక్నాలజీ మాత్రం అందుబాటులో ఉంది. ఇందుకోసం మనం గూగుల్‌కు చెందిన 'ఫైండ్ మై డివైజ్' అనే ఫీచర్‌ను వాడుకోవచ్చు. ఫోన్ దొంగతనానికి గురైనా, లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఫోన్‌ను మర్చిపోయినప్పుడు కూడా ఈ 'ఫైండ్ మై డివైజ్' అనే యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా మనం ఫోన్‌ను ట్రాక్ చేయొచ్చు. ఫోన్ ఉన్న లొకేషన్‌ను అది మనకు చూపిస్తుంది. అయితే ఆ ఫోనులో వాడుతున్న జీమెయిల్ అకౌంటుతోనే ఈ యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫోన్ స్విఛ్ ఆఫ్ అయినప్పటికీ మనం పోగొట్టుకున్న సమయానికి ఇంటర్నెట్ ఆన్‌లో ఉంటే, దాని లొకేషన్‌ను 'ఫైండ్ మై డివైజ్' ద్వారా ఈజీగా ట్రాక్ చేయొచ్చు.
ఐఫోన్‌ను కూడా కనిపెట్టేయవచ్చు!
ఐఫోన్ వినియోగదారులు ఐక్లౌడ్ వెబ్సైటులోకి వెళ్లి 'లాస్ట్ మోడ్'ను యాక్టివేట్ చేయాలి. వెంటనే ఫోన్ స్విఛ్ ఆఫ్ కాక ముందటి లొకేషన్ మన ఎదుట ప్రత్యక్షం అవుతుంది. ఐఫోన్ వినియోగదారులు ఐక్లౌడ్ ఫీచర్ ద్వారా, తమ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక శాంసంగ్ మొబైల్ యూజర్లు తమ డివైజ్‌లోని 'స్మార్ట్‌థింగ్స్ ఫైండ్ ఫీచర్'ని ఉపయోగించుకుని, పోగొట్టుకున్న ఫోన్లను ట్రాక్ చేయొచ్చు. అయితే ఈమెయిల్, ఫోన్ నంబర్ల ద్వారా ఈ ఫీచర్‌లో మనం రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
IMEI నంబర్ ఉంటే చాలు
ఇక ఇంటర్నెట్ కనెక్టివిటీతో సంబంధం లేకున్నా, పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌ను ట్రాక్ చేయాలంటే ఐఎమ్ఈఐ నంబరు కావాలి. ఈ రకమైన ట్రాకింగ్‌ను పోలీసులు, సంబంధిత దర్యాప్తు విభాగాలు చేస్తాయి. ఇందుకోసం మనం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నాం? ఎలా పోగొట్టుకున్నాం? అనేది వారికి తెలియజేయాలి. మన ఫోనును దొంగిలించిన వ్యక్తి అందులో వేరే సిమ్ కార్డ్ వేసుకున్నా ఈ ఐఎమ్ఈఐ నంబరు ద్వారా ట్రాక్ చేసేయవచ్చు.
వాట్సాప్ నయా ఫీచర్ - ఇకపై వాయిస్ మెసేజ్ వినే పనిలేదు - నేరుగా టెక్ట్స్ చదివేయడమే!