Govt Takes Strong View Of Google Delisting Apps From Play Store : గూగుల్ కంపెనీ భారతదేశంలోని ప్లేస్టోర్ నుంచి కొన్ని యాప్‌లను తొలగించడంపై టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చే వారం గూగుల్, టెక్ స్టార్టప్ కంపెనీలతో సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
యాప్‌లను తొలగిస్తున్న గూగుల్
ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ గూగుల్, సర్వీస్ ఫీజు చెల్లించని యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించడం ప్రారంభించింది. తమ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ, భారత్‌కు చెందిన కొన్ని కంపెనీలు సర్వీస్ ఫీజు చెల్లించడం లేదని కంపెనీ ఆరోపించింది. కానీ సదరు కంపెనీల పేర్లు మాత్రం బయటకు చెప్పలేదు. అయితే వీటిలో షాదీ, మాట్రిమోనీ, భారత్ మాట్రిమోనీ, ఆల్ట్ (ఆల్ట్ బాలాజీ), ఆడియా ప్లాట్‌ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ లాంటి యాప్‌లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఇవి ఏవీ గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించకపోవడం గమనార్హం.
ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయా?
గూగుల్ కంపెనీ ప్లేస్టోర్‌లోని యాప్‌లపై 15 శాతం నుంచి 30 శాతం వరకు సర్వీస్ ఛార్జీ వసూలు చేసేది. అయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలతో, గూగుల్ ఈ ఫీజులను 11%-26% వరకు తగ్గించింది. అయితే ఫీజులు తగ్గించినప్పటికీ చాలా యాప్‌లు సర్వీస్ ఫీజు చెల్లించడం లేదని గూగుల్ పేర్కొంది.
ఫ్రీ సేవలు అందించేది లేదు!
ఛార్జీల వ్యవస్థను తొలగించాలని సీసీఐ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, గూగుల్ దానిని ఆమోదించలేదు. ఛార్జీలను మాత్రమే తగ్గించింది. సుప్రీం కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీనితో ప్లేస్టోర్‌లో ఉన్న యాప్‌లు అన్నీ కచ్చితంగా సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని గూగుల్ స్పష్టం చేసింది. అయినప్పటికీ పలు యాప్‌లు గూగుల్‌కు డబ్బులు చెల్లించలేదు. దీనితో అలాంటి వాటికి క్రమంగా తొలగిస్తూ వస్తోంది గూగుల్.
మనకంటూ ఒక సొంత ప్లాట్‌ఫాం!
"ప్రస్తుతం మనం గూగుల్ లాంటి పలు సంస్థలకు చెందిన ప్లాట్‌ఫాంలపై ఆధారపడుతున్నాయి. వాస్తవానికి భారత కంపెనీలు అన్నీ నిబంధనలు పాటించాల్సిందే. అయితే మనకు యూపీఐ, ఓఎన్డీసీ తరహాలో ఒక సొంత దేశీయ యాప్‌స్టోర్/ ప్లేస్టోర్ ఉండాలి. ఇది ఒక వ్యూహాత్మక అవసరం" అని ఇన్ఫోఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ అభిప్రాయపడ్డారు.
బస్తీ మే సవాల్
సుప్రీం కోర్టులో గూగుల్ ప్లే స్టోర్‌ను సవాలు చేస్తున్న కంపెనీల్లో డిస్నీ+ హాట్‌స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్, స్టేజ్, మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అనాకడమీ, ఆహా, కుటుంబ్, టెస్ట్‌బుక్ లాంటి పలు సంస్థలు ఉన్నాయి.