LIE DETECTOR TEST : లై డిటెక్టర్ టెస్ట్.. ఈ పేరు వినగానే చాలా మందికి సినిమాలో బ్రహ్మానందం, అలీ మధ్య జరిగే సరదా సంభాషణ గుర్తొస్తుంది. అలీ చెప్పే అబద్ధాలకు 'మిషన్ అరుస్తుందిక్కడ' అంటూ బ్రహ్మానందం స్పందించే తీరు చూపరులకు నవ్వులు పంచుతుంది. కానీ, లై డిటెక్టర్ టెస్ట్ అక్కడ చూపినంత సులువుగా ఉండదు. అబద్ధం చెప్పినా ఎలాంటి సౌండూ ఉండదు. అసలు లై డిటెక్టర్ పరీక్ష ఎవరు? ఎవరికి చేస్తారో తెలుసా? సాక్ష్యాలు లేని, అత్యంత కీలక కేసుల్లో ముద్దాయిని విచారించడానికి లై డిటెక్ట్ పరీక్షను నిర్వహిస్తారు. ముద్దాయిని అడిగే ప్రశ్నలు, వాటికి అతడు చెప్పే సమాధానాలు, స్పందించే తీరును బట్టి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ లై డిటెక్టర్ పరీక్షకు అంతగా విశ్వసనీయత లేదనే వాదన కూడా ఉంది.
లై డిటెక్టర్ పరీక్షను పాలిగ్రాఫ్ అని కూడా అంటారు. ఈ పరీక్ష ద్వారా వ్యక్తి శరీర కదలికలు, నాడీ స్పందనను తెలుసుకుంటారు. వాటి ఫలితాలను అంచనా వేయడం ద్వారా అబద్ధం చెప్తున్నారా లేక నిజమే చెప్తున్నారా అనేది పరీక్షకులు విశ్లేషిస్తారు. పాలిగ్రాఫ్ యంత్రం సదరు వ్యక్తి శ్వాస క్రియ రేటుతో పాటు, పల్స్ లెక్కలను పసిగడుతుంది. రక్త ప్రసరణ వేగంతో పాటు చెమటను సైతం రికార్డు చేస్తుంది. శరీరం చుట్టూ రెండు ట్యూబ్స్ అమర్చి బ్రీతింగ్ రేటును పరిశీలిస్తారు. బాడీలో ఎలక్ట్రికల్ సర్క్యూట్ క్రియేట్ చేయడానికి చేతి వేళ్లకు ప్రత్యేకమైన పరికరాలను అమరుస్తారు.
గూగుల్‌కు పోటీగా OpenAI సెర్చింజిన్ - ఇది ఎలా పని చేస్తుందంటే? - ChatGPT AI Powered Search Engine
హాస్పిటల్లో డాక్టర్లు చేతికి చుట్టి రక్తపోటును పరిశీలించే యంత్రాన్ని కూడా లై డిటెక్టర్ పరీక్షలో వినియోగిస్తారు. ఇది బీపీతో పాటు గుండె కొట్టుకుంటున్న వేగాన్ని కూడా నిర్దారిస్తుంది. అయితే, ఆయా పరికరాల ద్వారా వచ్చే సంకేతాలన్నీ పరీక్షకుడి దగ్గర ఉండే కంప్యూటర్లో నమోదవుతాయి. ఎగ్జామినర్ తన ముందున్న వ్యక్తిని ప్రశ్నలు అడుగుతూ స్క్రీన్‌పై వస్తున్న గ్రాఫ్‌ను పరిశీలించి వాస్తవాలను అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు, మానసిక నిపుణులు మాత్రమే విశ్లషించగలరు. తాను అడుగుతున్న ప్రశ్నలకు ఎదుటి వ్యక్తి నిజం చెప్తున్నాడో లేక అబద్ధం చెప్తున్నాడో ఇట్టే తెలుసుకునే వీలుంటుంది. ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తులు మాత్రమే ఈ లై డిటెక్టర్ టెస్టును నిర్వహించి కచ్చితమైన ఫలితాలు అందిస్తారు.
2008 సంవత్సరంలో భారత అత్యున్నత న్యాయస్థానం తొలిసారిగా బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్ సిగ్నేచర్ ప్రొఫైలింగ్ (BEOSP లేదా BEOS ) పరీక్షను సాక్ష్యంగా పరిగణించింది. ఓ మహిళ తన కాబోయే భర్తను హత్య చేసినట్లు కేసు నమోదు కాగా దోషిగా నిర్ధారించడానికి పాలిగ్రాఫ్ ఫలితాన్ని కోర్టులో సాక్ష్యంగా స్వీకరించింది. కాగా, అనుమానితులపై నార్కోఅనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్ పరీక్షలను ఉపయోగించడం చట్టవిరుద్ధమని 2010 మే 5న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతివాది ఒప్పుకొంటే పాలిగ్రాఫ్ పరీక్షలు చట్టబద్ధమే.
2002లో గుజరాత్ అల్లర్ల కేసు, అబ్దుల్ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణం, 2006లో నోయిడా సీరియల్ మర్డర్స్, 26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో అబ్దుల్ కసబ్‌ల విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు. దిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్‌కూ పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.