YSRCP Leaders Irregularities in Kakinada Sez lands : కాకినాడ సెజ్ భూములను వైఎస్సార్సీపీ రాబందులు దిగమింగారు. వైఎస్సార్సీపీ హయాంలో మొదలైన జే-గ్యాంగ్ భూదందా రెండు దశాబ్దాల పాటు యథేచ్ఛగా సాగింది. జగన్మాయతో సెజ్ భూములను అప్పనంగా అరబిందోకు అప్పజెప్పేశారు. కన్నబాబు కమిటీ పేరిట బురిడీ కొట్టించి దాడిశెట్టి రాజా, ఆయన అనుచరగణం రైతుల భూములు లాక్కున్నారు. అడ్డగోలుగా సాగిన జే-గ్యాంగ్ ఆగడాలు, రైతుల ఆక్రోశంపై ఈటీవీ భారత్-ఈనాడు క్షేత్రస్థాయి పరిశోధన చేశాయి. బులుగు బ్యాచ్ దోపిడీ, దగాపడిన రైతుల సమగ్ర వివరాలను ఆధార సహితంగా ప్రజల ముందుంచుతున్నాయి.
అరబిందో సమస్యలు తీర్చేందుకే : 2019 మార్చిలో ప్రతిపక్ష నేతగా పిఠాపురంలో ప్రచారానికి వచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే న్యాయం చేస్తామని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన 8 మాసాల తర్వాత 2020 జనవరిలో అప్పటి మంత్రి కే కన్నబాబు ఛైర్మన్‌గా నలుగురు అధికారులు, సెజ్ కంపెనీ ప్రతినిధి సభ్యులుగా కమిటీ వేశారు. ఆ భూములపై అధ్యయనం చేసిన కన్నబాబు కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. సెజ్‌లో 2వేల 180 ఎకరాల భూములను యథాతథంగా లేదా ప్రత్యామ్నాయ భూములు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. పైపైన చూస్తే అంతా బాగానే ఉంది కదా అనిపిస్తుంది.
జగన్ మరో దాష్టీకం వెలుగులోకి - రాక్షస రాజకీయంతో కాకినాడ పోర్టు అరబిందో పరం!
కానీ నివేదికను లోతుగా పరిశీలిస్తే ఆత్మీయ కంపెనీ అరబిందో సమస్యలు తీర్చేందుకు జగన్ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా పావులు కదిపిందో అర్థమవుతుంది. ఎందుకంటే సెజ్ భూములు ఒకేచోట కాకుండా అక్కడక్కడా విడివిడిగా ఉంటాయి. వాటన్నింటికీ ఒక హద్దు ఏర్పాటు చేసి దాదాపు 6వేల ఎకరాలు కంపెనీకి అప్పజెప్పాలన్న కుతంత్రం కమిటీ సిఫారసుల్లో దాగి ఉంది. సెజ్ సరిహద్దు లోపల భూములు ఉంటే వాటిని కంపెనీకే అప్పగించి మరోచోట రైతులకు స్థలం ఇవ్వాలని కమిటీ సూచించింది. సెజ్ సరిహద్దుకు దూరంగా ఉన్న వారికి మాత్రమే సొంత భూములు తిరిగిచ్చేలా ఈ సిఫారసులు ఉన్నాయి.
దాడిశెట్టి రాజా అండ్ కో దోపిడీ పర్వం : కన్నబాబు కమిటీ సిఫారసుల అమలుకు 2021 మార్చిలో జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 12 జారీ చేసింది. ఆ తర్వాత మూడేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఎలా అమలుచేసిందో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే అనేక దారుణాలు బయటపడ్డాయి. ఆ మూడేళ్లలో కేవలం 187.55 ఎకరాల భూమిని మాత్రమే రైతులకు తిరిగిచ్చింది. మరో 492 ఎకరాలను ప్రత్యామ్నాయ భూమిగా మరికొందరికి అందజేసింది. దాదాపు 12 వందల ఎకరాలు మాత్రం ఇప్పటికీ రైతులకు ఇవ్వలేదు. భూములు తిరిగిచ్చే క్రమంలో దాడిశెట్టి రాజా అండ్ కో దోపిడీ పర్వం ఏ స్థాయిలో సాగిందో ఈటీవీ భారత్ - ఈనాడు పరిశీలనలో బయటపడింది.
2022 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకూ మంత్రిగా ఉన్న రాజా జీవో నెంబర్ 12ను కల్పతరువుగా మార్చుకున్నారు. రాజాతో పాటు ఆయన మామ దేవవరపు సూర్యచక్రం, వైసీపీ నాయకుడు గంగాధరరావు కారుచౌకగా రైతుల భూములు కొట్టేశారు. పిఠాపురం, తుని ప్రాంతాలకు సంబంధించిన ఇద్దరు ముఖ్య నేతలే 70కి పైగా ఎకరాలను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వీటిలో ఎక్కువ భాగం బినామీ పేర్లతో సేకరించారు. సెజ్ కంపెనీ నుంచి రైతుల పేరిట రిజిస్టర్ అయిన ఒకట్రెండు గంటల వ్యవధిలోనే తమ పేరిట బదిలీ చేయించుకున్నారు. ఏవీ నగరం గ్రామంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరం 9 లక్షలుగా ఉంది. కానీ వాస్తవంగా అక్కడ ఎకరం 15 లక్షల నుంచి 70 లక్షలు పలుకుతోంది. రోడ్డు పక్కనున్న భూముల కోసమైతే కోటి వరకూ పెడుతున్న వారూ ఉన్నారు. కానీ మార్కెట్ ధరను బూచిగా చూపించి దాడిశెట్టి రాజా అగ్గువగా భూములు కొట్టేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. U.కొత్తపల్లి మండలంలో పిఠాపురం వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో సెజ్ భూములు లాక్కున్నట్లు తెలిసింది. అప్పుడు ఈ ప్రాంతంలో హవా సాగించిన ముఖ్య నాయకుడే 40 ఎకరాలకు పైగా విలువైన భూములను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. 2022 జులై, అక్టోబర్, నవంబర్‌లో సాగిన ఈ దందాకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను ఈటీవీ భారత్ - ఈనాడు సేకరించాయి.
దాడిశెట్టి రాజాకు ఆ భూములు : రైతులకు రిజిస్ట్రేషన్ చేసిన రోజునే దాడిశెట్టి అండ్ కో భూములు బదలాయించుకోవడంపై మచ్చుకు కొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. 7702 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా రైతులు కొయ్య అప్పారావు, కొయ్య సత్యనారాయణకు కాకినాడ సెజ్ నుంచి 1.01 ఎకరాల భూమి బదిలీ అయింది. ఏమాత్రం ఆలస్యంగా లేకుండా కొద్దిసేపటికే 7715 నెంబర్ ద్వారా దాడిశెట్టి రాజాకు రైతులు ఆ భూమిని రాసిచ్చేశారు. గోళ్ల పెద్దఅప్పారావు, చిన్నఅప్పారావు, నూకరాజు, గోళ్ల ఉప్మాకు, గోళ్ల బాబూరావుకు రిజిస్ట్రేషన్ నెంబర్ 7706 ద్వారా 93 సెంట్లను బదలాయించగా వెంటనే రిజిస్ట్రేషన్ నెంబర్ 7717 ద్వారా రాజాకు అప్పజెప్పారు.
తలపంటి మణితల్లి, కొండబాబు, చంటిబాబు, కృష్ణలకు 7708 నెంబర్ ద్వారా 90 సెంట్లు రిజిస్టర్ చేయగా మరుక్షణమే 7716 నెంబర్ ద్వారా రాజాకు రిజిస్టర్ చేశారు. సెజ్ నుంచి 7707 నెంబర్ ద్వారా కొయ్య అప్పారావుకు అర ఎకరం బదిలీ అవగా కాసేపటికే 7714 నెంబర్ ద్వారా రాజాకు ఇచ్చేశారు. 7701 రిజిస్ట్రేషన్ నెంబర్‌తో దూలం కొండబాబుకు ఎకరం రిజిస్టర్ చేయగా వెంటనే 7718 రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఆ భూమి రాజా సొంతమైంది. సెజ్ నుంచి 10832 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కాలిన నూకాలమ్మకు ఎకరం భూమి బదిలీ చేయగా వెనువెంటనే ఆమె నుంచి 10856 నెంబర్ ద్వారా రాజాకు రిజిష్టర్ అయింది. యాదాల నాగమణికి 10831 రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎకరం భూమి సొంతమవగా కొద్దిసేపటికే 10857 రిజిస్ట్రేషన్ నెంబర్‌తో దాడిశెట్టి రాజా మామ దేవవరపు సూర్యచక్రంకు వెళ్లిపోయింది. 12161 నెంబర్ ద్వారా గంపల చంద్రరావుకు ఎకరం 20 సెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తే కొన్ని గంటల్లోనే 12488 నెంబర్‌తో దాడిశెట్టి రాజా అనుచరుడు నాగం గంగాధరరావుకు భూమి బదిలీ అయింది.
కాకినాడ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక జోన్, ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తామంటూ 2005లో రాష్ట్ర ప్రభుత్వంతో ఓఎన్జీసీ ఒప్పందం చేసుకుంది. 13 గ్రామాల్లో 8వేల 120 ఎకరాల సేకరణకు ఆనాటి వైఎస్సార్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రైతుల నుంచి భూములు లాక్కున్నాక ఓఎన్జీసీని వెళ్లగొట్టి ప్రైవేటు సంస్థకు సెజ్‌ను అప్పజెప్పింది. ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం తీసుకోవాల్సిన వాటానూ వదిలేసుకుంది. 2019లో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో కాకినాడ సెజ్‌ను 'అరబిందో రియాలిటీ'కి కట్టబెట్టారు.
వైఎస్సార్సీపీ 'సముద్రపు దొంగలు' - కాకినాడ పోర్టులో చినబాబురెడ్డి 'డి గ్యాంగ్' దందాలు
ప్రభుత్వ వ్యవస్థలు పతనం! - కాకినాడ పోర్టు కేంద్రంగా భారీగా తరలుతున్న సరుకు