YSRCP Leaders Distributing Gifts to Voters : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార వైసీపీ నాయకులు ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రలోభాల దందాను విస్తృతం చేశారు. ఊరూరా చీరలు, ప్యాంట్లు, షర్టులు, కుక్కర్లు, టీ కప్పుల సెట్లు, మిఠాయిలు, సెల్‌ఫోన్లతో పాటు రూ.5000ల నుంచి రూ.6000ల నగదు పెట్టిన కవర్లను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాలు అంటూ నిర్వహించి కుల, మత సంఘాల సభ్యులను, ప్రతినిధులను కలుస్తూ మత ప్రాతిపదికన ఓట్లడుగుతున్నారు.
YSRCP Manipulating Voters : ఇలాంటి చర్యలన్నీ చట్టపరంగా శిక్షార్హమని కొన్నిరోజులుగా ఎన్నికల సంఘం చెబుతూనే ఉంది. వైసీపీ (YSRCP) నాయకులు మాత్రం మతం మాటున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. హోంమంత్రి తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావాలని క్రైస్తవ పాస్టర్లతో ప్రార్థనలు చేయించారు. ఆ సమావేశానికి హాజరైన వారందరికీ కొత్త వస్త్రాలు పంపిణీ చేశారు. సీఎం జగన్ మేనత్త వై.ఎస్.విమలారెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్రైస్తవ పాస్టర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ జగన్‌ను ఆశీర్వదించాలని పిలుపునిస్తున్నారు.
టీడీపీ, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టారు - మాలో విభేదాలు సృష్టించలేరు : చంద్రబాబు
గుర్తించుకుని ఓటు వేయాలని ప్రచారం : మంత్రి జోగి రమేశ్ అయితే పుట్టుకతో క్రైస్తవులమైన మనమంతా ఏసు బిడ్డ జగన్‌ను (CM Jagan) మరొకసారి ముఖ్యమంత్రిగా, తనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలంటూ ఇటీవల పాస్టర్లను, దైవ సహాయకులను కోరారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిల ఫొటోలు ముద్రించిన బ్యాగుల్లో చీరలు పెట్టి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే మీకు చీరలు పంపించారు. వారిని గుర్తించుకుని ఓటు వేయాలని ప్రచారం చేయించారు.
ఒక రాజకీయ పార్టీ తరఫున వాలంటీర్ల ప్రచారం : ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవవేతనం, పారితోషకాలు తీసుకుంటున్న వాలంటీర్లు ఒక రాజకీయ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించడం చట్ట విరుద్ధం. ఇది అధికార దుర్వినియోగం కిందకు వస్తుంది. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఉరుకూటి రామచంద్రరావు ఆధ్వర్యంలో వార్డు వాలంటీర్లకు కుక్కర్లు, రిసోర్స్‌పర్సన్లకు చీరలు పంపిణీ చేశారు. మంత్రి దాడిశెట్టి రాజా అయితే వాలంటీర్లకు సెల్‌ఫోన్లు ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్లకు రూ.7000ల చొప్పున నగదు పంపిణీ చేశారు.
టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్ - వైఎస్సార్సీపీ చీటింగ్ టీమ్ : చంద్రబాబు
YSRCP Temptations for Voters : ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వెలుగు యానిమేటర్లకు డిన్నర్, టీ కప్పుల సెట్లు పంపిణీ చేశారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావులు వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, రిసోర్స్‌పర్సన్‌లకు కుక్కర్లు, చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈ-వ్యాలెట్‌ల ద్వారా వాలంటీర్ల ఖాతాలకు డబ్బులు పంపిస్తున్నారు. మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు వాలంటీర్లకు చీర, స్వీట్ ప్యాకెట్, రూ.5000ల నగదు పంపిణీ చేశారు. మైలవరంలో వైసీపీని మరోసారి గెలిపించేలా వాలంటీర్లు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని కోరారు.
రాజానగరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి రాజశ్రీ సచివాలయ ఉద్యోగులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు కానుకలు పంపిణీ చేశారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటింటికీ చీరలు పంపిణీ చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తరఫున ఆయన తనయుడు డిన్నర్ సెట్లను పంపిణీ చేస్తున్నారు. బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి తరఫున ఆయన కుటుంబీకుడు కోన వెంకట్ మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు, షర్టు బిట్లు పంపిణీ చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి చీరలు పంపిణీ చేశారు.
పెద్ద ఎత్తున తాయిలాల పంపిణీ : మంత్రి రోజా (Minister Roja) నగరి నియోజకవర్గంలోని మహిళలకు మహిళా దినోత్సవ గిఫ్ట్‌ల పేరిట చీరలు, జాకెట్లు పంపిణీ చేశారు. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంక్రాంతి కానుకల పేరిట నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ కుక్కర్లు అందజేశారు. వాటిపై వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఫొటో ముద్రించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయనున్న నేపథ్యంలో అక్కడా తాయిలాల పంపిణీ పెద్ద ఎత్తున సాగిస్తున్నారు.
సీఈసీ ఆదేశించినా స్పందించని అధికారులు : డబ్బు, మద్యం, ప్రలోభపెట్టేందుకు పంపిణీ చేసే అవకాశమున్న వస్తువులపై దాడులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ జనవరి 10న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇంత స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఆంధ్రప్రదేశ్ అధికారులు ఎక్కడా దాడులు చేయట్లేదు.
మంత్రి రోజాకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదు - నగరి వైఎస్సార్సీపీ నేతల కామెంట్స్
వైఎస్సార్సీపీ పాలనలో 300 మంది బీసీలను చంపేశారు : పవన్ కల్యాణ్