YSRCP Leaders Torcher To Mumbai Heroin : జగన్ హయాంలో ముంబయికి చెందిన ఓ హీరోయిన్‌ను వైఎస్సార్సీపీ పెద్దలు, కొందరు ఐపీఎస్ అధికారులు వేధించారన్న వార్త దుమారం రేపుతోంది. ముంబయికి చెందిన ఓ సినీనటిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఒకరు, ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించినట్లు సమాచారం. అనంతరం అధికార బలాన్ని ప్రయోగించి బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారు. ఆ తర్వాత వారిని బెదిరించి పెళ్లి మాట ఎత్తకూడదంటూ బలవంతంగా సంతకాలు చేయించుకుని పంపించేశారు. ఈ వ్యవహారంలో అన్ని వేళ్లూ నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, నాటి విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ వైపే చూపిస్తున్నాయి.
సినీనటి వ్యవహారంలో సజ్జల సాయం : కృష్ణా జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు, 2014లో వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ వివాహానికి వెళ్లారు. అక్కడ ముంబయికి చెందిన సినీనటితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఏళ్ల తరబడి సన్నిహితంగా మెలిగారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్ నిరాకరించారు. ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి మరింతగా ఒత్తిడి పెరగడంతో పాటు, ఎన్నికల వేళ ఈ వ్యవహారం బయటపడితే తనకు, పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని, నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాలంటూ ఆయన నాటి విజయవాడ సీపీ కాంతిరాణాను ఆదేశించారు.
ఆఘమేఘాలపై అరెస్టు : సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఆదేశాలు రావడంతో వైఎస్సార్సీపీతో అంటకాగే కాంతిరాణా టాటా వాయువేగంతో కదిలారు. ముంబయి నటి, ఆమె కుటుంబీకులపై విద్యాసాగర్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దాని ఆధారంగా ఆఘమేఘాలపై ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వెంటనే అప్పట్లో విజయవాడ డీసీపీగా పనిచేసిన ఓ యువ ఐపీఎస్ అధికారి (సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ వీడియోలతో విపరీతమైన ప్రచారం చేసుకుంటారు), ఓ ఏడీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలతో కూడిన బృందాన్ని విమానంలో ముంబయికి పంపించారు.
అంతర్జాతీయ ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరగాళ్ల మాదిరిగా సినీనటిని, ఆమె తల్లిదండ్రుల్ని ఈ కేసులో అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. కోర్టు వారి ముగ్గురికీ రిమాండు విధించింది. వారు జైలు నుంచి విడుదలయ్యాక పోలీసులు తీవ్రంగా బెదిరించారు. పెళ్లి మాటెత్తితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి వారితో సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. అప్పట్లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో ముంబయికి వెళ్లిపోయింది. ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ ఉదంతం ఆరు నెలల తర్వాత తాజాగా వెలుగులోకి వచ్చింది.
పారిశ్రామికవేత్తతో సంబంధం : దేశంలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుటుంబీకుడు ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఈ సినీనటి కొన్నాళ్ల కిందట ముంబయిలో ఓ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ముంబయిలో సెటిల్ చేస్తే తన ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని భావించిన ఆ పారిశ్రామికవేత్త, నాటి ప్రభుత్వ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాలరీత్యా వారి సాయం కోరినట్లు మరో ప్రచారం సైతం ఉంది. దీంతో విద్యాసాగర్ వ్యవహారాన్ని ముందుపెట్టి కథ నడిపించారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో భారీగా సొమ్ములు చేతులు మారినట్లు తెలుస్తోంది.
విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసిన కాంతిరాణా టాటా తీరు తొలి నుంచీ వివాదాస్పదమే. వైఎస్సార్సీపీ అరాచకాలకు కొమ్ము కాసిన ఆయన బాధితులపైనే రివర్స్ కేసులుపెట్టారన్న ఫిర్యాదులున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కాంతిరాణా ఏ స్థాయిలో అరాచకాలు పాల్పడ్డారో చెప్పేందుకు ఈ తాజా ఉదంతమే తార్కాణమని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన హయాంలో జరిగిన ఇలాంటి అరాచకాలపై విచారణ జరిపించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ విషయంపై విజయవాడ సీపీని వివరణ కోరగా ఇప్పటివరకు తమకు ఫిర్యాదు రాలేదని చెప్పారు. ఫిర్యాదు వస్తే ఘటనలో పోలీసుల పాత్రపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
దువ్వాడ కుటుంబ కథా చిత్రం - అర్ధరాత్రి ఏం జరిగిందంటే? - Duvvada Srinivas Family Controversy