YSRCP Leader Chevireddy Bhaskar Reddy Occupied RTC Lands : అధికారం అండతో వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ స్థలాలను కాజేసిన వైనం ఒక్కొక్కటిగా బయటకువస్తోంది. ప్రకాశం జిల్లాలో ఆర్టీసికి చెందిన విలువైన స్థలాన్ని కాజేశారు. ఇప్పుడీ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. రూ.కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలను తిరుపతికి చెందిన వైఎస్సార్సీపీ నేత, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కారుచౌకగా కొట్టేశారు. ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి చెందిన సీఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఆర్టీసీ స్థలాలను అగ్రిమెంట్ చేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, అద్దంకి, టంగుటూరు డిపోల పరిధిలోని స్థలాలను లీజు పేరుతో దక్కించుకున్నారు. గత ఏడాది నవంబరులో ఆర్టీసీ అధికారులు వీటికి టెండర్లు పిలవగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పదిహేనేళ్లకు లీజు ఒప్పందం చేసుకున్నారు. ఈ స్థలాల కోసం పలువురు పోటీపడినా వారిని బెదిరించి తప్పుకొనేలా చేసి, కుమారుడి సంస్థకు కట్టబెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
విశాఖలో చెవిరెడ్డి వేయి కోట్ల వ్యాపారం చేశాడు- మూర్తియాదవ్ - Murthy Yadav Fires on Bhaskar Reddy
ఒంగోలు డిపో పరిధిలో 1978 చదరపు అడుగుల స్థలానికి నెలకు 2లక్షల 75వేల రూపాయలు అద్దె ప్రాతిపదికన 15 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. ఇక్కడ టెండర్ల పక్రియలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారు. మొదటి వ్యక్తి తాను లీజు కట్టలేనని పక్కకు తప్పుకోవడంతో రెండోదిగా ఉన్న సీఎంఆర్ ఇన్ఫ్రా సంస్థకు టెండరు దక్కింది. తొలివ్యక్తిని బెదిరించడంతో ఆయన తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న అద్దంకి డిపో వద్ద 1970 చదరపు అడుగుల స్థలాన్ని సైతం సీఎంఆర్ ఇన్ఫ్రానే తీసుకుంది. నెలకు 62 వేల రూపాయల చొప్పున లీజు చెల్లించేలా టెండర్లు దక్కించుకుంది.
ఒంగోలులో ఆర్టీసి గ్యారేజీలో కొంత స్థలాన్ని కలిపి అడ్డంగా గోడ కట్టి, రెండో వైపు గేటును తొలగించి చదును చేసే పనులు చేపట్టారు. ఇన్నాళ్లూ ఈ వ్యవహారం గట్టుచప్పుడు కాకుండా చేపట్టారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూలిపోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ఆధ్వర్యంలో దీనిపై తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణపు పనులు నిలిపివేయాలని ఎమ్మెల్యే జనార్దన్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి భూకబ్జారెడ్డిగా మారారు - అచ్చెన్న ధ్వజం
టంగుటూరులో రైల్వేస్టేషన్ ఎదుట 8 ఎకరాల విస్తీర్ణంలో ఆర్టీసీ బస్టాండ్ ఉంది. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ స్థలంలో సుమారు అర ఎకరం భూమిని గత ప్రభుత్వం లీజుకు కట్టబెట్టింది. ఒప్పందం చేసుకున్న వారు అక్కడి వృక్షాలను 3 రోజులుగా నరికేస్తూ చదును చేస్తున్నారు. స్థానికులు ఆరా తీయడంతో లీజు వ్యవహారం బయటకు వచ్చింది.
ఇటుక బట్టీల మాటున భారీ ఎత్తున మద్యం గుట్టలు- చెవిరెడ్డి అనుచరుడి హవా - Huge Liquor at YSRCP follower