YSRCP Irregularities Matam Lands in Tirupati : హిందూ ధర్మవ్యాప్తి పేరుతో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఏర్పాటైన కొన్ని ధార్మిక పీఠాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ పెద్దల అండతో విశాఖ శారదా పీఠం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు సేవ చేయకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా శారద పీఠం వ్యవహరిస్తోందని హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Visakha Sharada Peetham Land Issue : శ్రీనివాసుడు కొలువైన తిరునగరిలో భక్తులకు సౌకర్యాల కల్పనలో ధార్మిక మఠాల పాత్ర కీలకమైంది. దేశం నలుమూలల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు టీటీడీ వసతి గృహాలతో పాటు తిరుమలలో ఏర్పాటైన 33 ధార్మిక మఠాలలో గదులు పొందే వెసులుబాటు ఉంది.
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేశంలోని ప్రముఖ మఠాలకు తిరుమలలో స్థలాలు కేటాయించి శాఖలు ఏర్పాటు చేసుకొనేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పించింది. తిరుమలలో శాఖలను ఏర్పాటు చేసిన మఠాలు శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు వసతి, అన్నదానం చేయాల్సి ఉంటుంది.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు : టీటీడీ కేటాయించిన స్థలాల్లో భవనాలు నిర్మించిన కొన్ని మఠాలు భక్తులకు ఉచితంగా సేవలు అందించకపోగా ప్రైవేటు హోటల్స్‌గా మారాయి. ప్రధానంగా జగన్‌కు రాజగురువుగా గుర్తింపు పొందిన స్వరూపనందేంద్రస్వామి నిర్వహణలో ఉన్న శారదా పీఠంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగాయి. 4 వేల187 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిబంధనలు అతిక్రమించి ఆరు అంతస్తుల్లో భారీ నిర్మాణాలు చేపట్టడం వివాదస్పదమైంది.
యథేచ్చగా ఆక్రమణలు : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది నుంచే శారదా పీఠం యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగించిందనే విమర్శలు ఉన్నాయి. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్దీకరించాలని కోరుతూ శారదాపీఠం తిరుమల తిరుపతి దేవస్థానానికి విజ్ఞప్తి చేసింది. శారదా పీఠం కోరడమే ఆలస్యం అన్న రీతిలో టీటీడీ ధర్మకర్తల మండలిలో అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరిస్తూ తీర్మానం చేశారు.
వ్యాపార పీఠంగా మార్చేశారనే విమర్శలు : విశాఖ శారదా పీఠం ఆక్రమణలపై హిందూ పరిరక్షణ సంఘాలు నిరసనకు దిగాయి. తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారని, రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. ఈ నేపథ్యంలో మఠాల పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో భక్తులను యథేచ్ఛగా దోచుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వివాదాలు - ఆజ్యం పోస్తున్న బోర్డు