YSRCP Government Careless on Panchayats : జగన్ మోహన్ రెడ్డి జమానాలో నిధులు, విధుల్లేక నిరుత్సాహపడిన సర్పంచ్‌లు కొత్త ప్రభుత్వంపై కొండంత ఆశలు పెట్టుకున్నాయి. గతంలో సర్పంచ్‌ల పోరాటానికి అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో పంచాయతీలకు ఇక పూర్వ వైభవం వస్తుందని, పల్లెల్లో ప్రథమ పౌరులు మళ్లీ తలెత్తుకుని తిరగొచ్చనే విశ్వాసం నెలకొంది.
పంచాయతీలు నిర్వీర్యం : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్ముడి మాటలకు వక్రభాష్యం చెప్పినన వైఎస్సార్సీపీ ప్రభుత్వం, పల్లె పాలకులకు కనీసం పాలేరులకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వలేదు. ఆర్థిక సంఘం నిధులను పూర్తిగా దారి మళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేసేసింది. ఐదేళ్లుగా నిధులు లేక చాలా పంచాయతీలు అచేతనావస్థలో ఉండిపోయాయి. గ్రామాల్లో అభివృద్ధి కరవైంది. దీనికితోడు గ్రామ సచివాలయాల నిర్వహణను పంచాయతీలకే అప్పగించారు.
పర్యవేక్షణ మాత్రం రెవెన్యూ శాఖకు ఇచ్చారు. సచివాలయాల్లో ఫర్నీచర్, స్టేషనరీతో పాటు సదుపాయాల కల్పన బాధ్యతను పంచాయతీలకు ఇచ్చారు. కనీసం పంచాయతీలు సాధారణ నిధులు ఖర్చు చేయడానికి కూడా కొర్రీలు వేశారు. కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం లాగేసుకున్న అధికారాలన్నీ తిరిగి అప్పగిస్తారని సర్పంచ్‌లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పోరాడితే కేసులు : గత ఐదేళ్లలో పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధుల్నీ వైఎస్సార్సీపీ సర్కార్ లాగేసుకోవడంతో గ్రామాల్లో అభివృద్ధి చేయలేకపోయామనే భావనలో సర్పంచులున్నారు. ఇప్పుడు కూటమి సర్కారు రాకతో మార్చి నెలలో విడుదలైన 15 వ ఆర్ధిక సంఘం నిధులపై ఆశలు పెట్టుకున్నారు. గత ఐదేళ్లలో సర్పంచుల మీద కక్ష గట్టిన జగన్ వారి హక్కుల కోసం పోరాడితే కేసులు పెట్టి వేధించారు. వీటి నుంచీ విముక్తి కలుగుతుందనే ఆశాభావంతో ఉన్నారు.
గ్రామ స్వరాజ్యం కోసం ప్రభుత్వం కృషి : వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్పంచ్‌ల చెక్‌పవర్ కూడా లాగేసుకోవడంతో గ్రామాల్లో కనీసం పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలివ్వలేకపోయారు. ఇప్పుడు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న నమ్మకం తమకు ఉందంటున్నారు.
అధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్ చర్చలు : ఇటీవలే గ్రామాల్లో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వైద్యం తదితర అంశాలపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్ చర్చించారు. వాటి బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పంచాయతీలకు నిధులతో పాటు పూర్వ వైభవం వస్తుందని సర్పంచులు ఆశిస్తున్నారు.