YSRCP Club House in Pulivendula : కూటమి గెలుపుతో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అరాచకాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం కె.వెలమవారిపల్లెలోని విజయ హోమ్స్‌కి చెందిన క్లబ్‌హౌస్ విస్తీర్ణం 2.17 ఎకరాలుగా అప్పటి కలెక్టర్ విజయరామరాజు 2022 నవంబరు 11న రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకి రాసిన లేఖలో సిఫార్సు చేశారు. మొత్తం 4 కోట్ల 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని పర్యాటకాభివృద్ధి సంస్థకు కలెక్టర్ సూచించారు. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లబ్ హౌస్ విస్తీర్ణం 1.71 ఎకరాలుగా తేల్చారు.
సార్వత్రిక ఎన్నికల్లోగా పులివెందుల్లో స్టార్ హోటల్ నిర్మాణం పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం భావించింది. సీఎంవో ఆదేశాలపై పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. హోటల్ నిర్మాణానికి 23.50 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేశారు. పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు 2022 ఏప్రిల్ 18న అప్పటి సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ సర్వసభ్య సమావేశంలో బీజం పడింది. ఇందుకోసం నాలుగు స్థలాలను తెరపైకి తీసుకొచ్చి వాటిలో నుంచి ఎంపీ అవినాష్‌రెడ్డి బావ విజయశేఖర్‌రెడ్డికి చెందిన నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్‌ని ఖరారు చేశారు.
రెవెన్యూ అధికారులు క్లబ్ హౌస్ యజయానికి అనుకూలంగా ఆఘమేఘాలపై నివేదికలు తయారు చేశారు. క్లబ్ హౌస్‌ని పర్యాటకాభివృద్ధి సంస్థ ద్వారా కొనుగోలు చేయించాలన్న ప్రతిపాదన సీఎంవో కార్యాలయం నుంచి రావడమే తడవుగా అప్పటి పర్యాటకశాఖ ఉన్నతాధికారి ఒకరు మహద్భాగ్యమన్నట్లుగా వ్యవహరించారు. రుషికొండపై రాజభవనం నిర్మాణ పనులు పూర్తి చేయించే బాధ్యత కూడా జగన్ ప్రభుత్వం ఆయనకే అప్పగించింది.
పులివెందులలో స్టార్ హోటల్ నిర్మించాలన్న ప్రతిపాదన వెనుక చాలా పెద్ద కథే ఉంది. హోటల్ పేరుతో నిర్మాణంలోని క్లబ్ హౌస్ పనులను పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ, పర్యాటకాభివృద్ధి సంస్థల ద్వారా పూర్తి చేయించి వైఎస్సార్సీపీ నేతలు తమ అవసరాలకు వాడుకోవాలన్నది ఉద్దేశంగా తెలుస్తోంది. నియోజకవర్గ పర్యటనకు జగన్ వచ్చే సమయంలో ఆయనతో పాటు వచ్చే వారికి వసతి, ఇతరత్రా సమయాల్లో నియోజకవర్గంలో కీలక నేతల సమాలోచనాలు, సమావేశాల కోసం వినియోగించేందుకు పథకం వేశారని సమాచారం. భవనం లగ్జరీగా ఉండాలంటే ఫోర్ స్టార్ హోటల్ అనివార్యమన్నట్లుగా ప్రణాళికలు రచించారు.