Dhulipalla Narendra on Palnadu incident: అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయని వైఎస్సార్సీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడును వైఎస్సార్సీపీ నేతలు వల్లకాడు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కొంత మంది పోలీసు అధికారులతో వైఎస్సార్సీపీ నేతలు కుమ్మకై టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేసి విధ్వంసం సృష్టించారని ధూళిపాళ్ల దుయ్యబట్టారు. ఇప్పుడు ఏమి లేనట్లు సిగ్గు లేకుండా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై అబాండాలు మోపుతున్నారని మండిపడ్డారు.
ఎవరు ఎవరిపై దాడి చేశారో వీడియోలు లేవా, స్థానిక ప్రజలు చెప్పడం లేదా? అని ప్రశ్నించారు. ఐదేళ్ల నుంచి వైఎస్సార్సీపీ రౌడీలు, గూండాలు చెలరేగిపోతున్నారని విమర్శించారు. ఇప్పుడు అధికారం కోల్పోతున్నామన్న అక్కసుతో దాడులతో చెలరేగిపోయారన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారని అయినా ప్రజలు వైఎస్సార్సీపీని, జగన్నాసురుడిని ఓడించాలనే కసితో అర్థరాత్రి వరకు క్యూలో వేచి ఓటు వేశారని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.
ఓటమిని గ్రహించిన వైఎస్సార్సీపీ నేతలు సాకులు చెప్పుకుంటూ ప్రతిపక్షాలు, పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎల్లకాలం అబద్దాలు, తప్పుడు ఆరోపణలతో ప్రజలను మోసం చేయలేరు అనే సంగతిని గ్రహించి ఇకనైనా వైఎస్సార్సీపీ నేతలు బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు. ఇక ఓటమి తథ్యమని వైఎస్సార్సీపీ నేతలు తెలుసుకున్నారు. అందుకే ఒక్కొక్కరు ఒక్కో దేశానికి పారిపోతున్నారన్నారు. జూన్ 4 తర్వాత మిగిలిన వైఎస్సార్సీపీ నేతలు కూడా రాష్ట్రం విడిచి పారిపోవడం ఖాయమని తెలిపారు.
ఎన్నికల అనంతరం హింస - బదిలీ అయిన వారి స్థానాల్లో కొత్తవారు నియామకం - 5 Dsps 3 Inspectors
ఈసీకి ఫిర్యాదు చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు: పల్నాడు జిల్లాలో ఓటింగ్ అంతా తెలుగుదేశం కనుసన్నల్లోనే జరిగిందనే వైఎస్సార్సీపీ ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ఎస్పీకి, తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. పల్నాడు హింసపై అన్ని కోణాల్లో విచారణ చేయాలని, తన ప్రమేయం ఉన్నట్లు తేలితే ఛార్జిషీట్లో పేరు పెట్టుకోవచ్చని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. టీడీపీ మీద జరుగుతున్న కుట్రపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈఓ ముకేశ్ మీనాను కలిసి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎస్పీలను మార్చిన ప్రాంతాల్లోని అధికారులు టీడీపీతో కుమ్మక్కై పోలింగ్‌ను అనుకూలంగా మార్చుకున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు.