YS Jagan Letter To Sharmila : సొంత తల్లి, చెల్లిపైనే కోర్టుకు ఎక్కిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా తనను వ్యతిరేకించినందుకు రాసిచ్చిన ఆస్తులు వెనక్కి తీసుకుంటానంటూ తన సోదరి షర్మిలకు జగన్ రాసిన లేఖ బయటపడింది. తన వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించినందుకు చెల్లిపై ప్రేమ, ఆప్యాయతలు పోయాయంటూ ఆగస్టు 27వ తేదీన షర్మిలకు లేఖాస్త్రం సంధించారు. తన వైఖరితో బాధించినందుకే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీడ్ కింద షర్మిలకు రాసిచ్చిన వాటాను వెనక్కి తీసుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు.
సత్సంబంధాలు లేని కారణంగా గతంలో ఇచ్చిన ఆస్తి వాటాను రద్దు చేసుకుంటున్నానంటూ జగన్ ఆగస్టు 27న తన సోదరి షర్మిలకు రాసిన లేఖను ఎన్‌సీఎల్టీలో దాఖలు చేసిన పిటిషన్‌కు జోడించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించిన, వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను ఆయన బతికున్నప్పుడు ఇద్దరికీ సమానంగా పంచారని లేఖలో జగన్ పేర్కొన్నారు. ఆ తర్వాత తన సొంత శ్రమ, పెట్టుబడితో వ్యాపారాలు మొదలు పెట్టానని, వాటికి వారసత్వంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎంతో ప్రేమ, ఆప్యాయతతో కొన్ని ఆస్తులను షర్మిల పేరిట బదిలీ చేసి, విశ్వాసం కల్పించేందుకు గిఫ్ట్ డీడ్ కింద తల్లి విజయమ్మ పేరిట కూడా కొన్ని షేర్లు రాసిచ్చినట్లు లేఖలో తెలిపారు.
అన్నపై చెల్లెలి లేఖాస్త్రం - జగన్‌పై 8 అంశాలతో కౌంటర్ అటాక్
ఇప్పటి వరకు రూ.200 కోట్లు ఇచ్చా : న్యాయపరమైన చిక్కులు తొలిగాక భవిష్యత్తులో ఆ ఆస్తులు సోదరి షర్మిలకు చెందేలా ఒప్పందం చేశానని జగన్ లేఖలో ప్రస్తావించారు. అవేకాకుండా తల్లి ద్వారా గత దశాబ్ద కాలంలో రూ.200 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. షర్మిల చర్యలు వ్యక్తిగతంగా తనను తీవ్రంగా బాధించడంతో ఆమెపై ప్రేమ, ఆప్యాయత తగ్గిపోయాయని లేఖలో తెలిపారు. తనకు వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడినందుకు ప్రేమ, ఆప్యాయత చూపాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.
మార్పు వస్తే పునరుద్ధరిస్తా : షర్మిల ఆలోచనలో, ప్రవర్తనలో ఏదైనా సానుకూల మార్పులు వస్తే తిరిగి ప్రేమ, ఆప్యాయత పునరుద్ధరిస్తానంటూ జగన్ లేఖలో ఆఫర్ ఇచ్చారు. కోర్టు కేసులన్నీ పరిష్కృతం అయ్యాక ఆస్తులకు సంబంధించి ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎంత చేయాలి? అనే అంశాలు తిరిగి పరిశీలిస్తానని, తనకు, వై.ఎస్.అవినాష్ రెడ్డి, వై.ఎస్.భారతికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని జగన్ షరతు విధించారు. రాజకీయంగా తనకు వ్యతిరేకంగా ఉండొద్దంటూ జగన్ మరో లేఖ షర్మిలకు రాసినట్లు సమాచారం.
వైఎస్ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు - తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్