YS Jagan Illegal Assets Case: జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటి నుంచి మొదలైంది. ఇవాళ అరబిందో ఛార్జిషీట్లో జగన్ వేసిన డిశ్చార్జి పిటిషన్పై వాదనలు ప్రారంభమయ్యాయి. జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి వాదనల కోసం విచారణను సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఛార్జిషీట్ల వారీగా డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు వినాలని న్యాయస్థానం నిర్ణయించింది.
అదే విధంగా సీబీఐ 11, ఈడీ 9 ఛార్జిషీట్ల సారాంశం, డిశ్చార్జి పిటిషన్లు, ఇప్పటి వరకు జరిగిన విచారణ తీరును కొత్త జడ్జి టి.రఘురాం న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు. రేపటి నుంచి ఛార్జిషీట్ల వారీగా డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు వినాలని న్యాయస్థానం నిర్ణయించింది. సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో జగన్, ఇతర నిందితులు కేసు నుంచి తమను తొలగించాలంటూ వేసిన 130 డిశ్చార్జి పిటిషన్లు పదేళ్లుగా పెండింగులో ఉన్నాయి.
కేసుల నుంచి తొలగించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, జె.గీతారెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, పి.శరత్ చంద్రారెడ్డి, పి.ప్రతాప్ రెడ్డి, పునీత్ దాల్మియా, జితేంద్ర వీర్వాణి, నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి, ఎం.శామ్యూల్, బీపీ ఆచార్య, జి.వెంకట్రామిరెడ్డి, మన్మోహన్ సింగ్, వి.డి.రాజగోపాల్, ఎస్.ఎన్.మొహంతి, తదితరులు వేసిన డిశ్చార్జి పిటిషన్లు కోర్టులో పెండింగులో ఉన్నాయి. సీబీఐ కోర్టులో 2013 నుంచి దాఖలైన ఈ డిశ్చార్జి పిటిషన్లు ఇప్పటికీ తేలడం లేదు.
సుదీర్ఘ వాదనలు కొంత వినగానే జడ్జీలు బదిలీ కావడంతో, మళ్లీ మొదట్నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇలా పదకొండేళ్లలో ఏడుగురు జడ్జిలు బదిలీ అయ్యారు. ఇటీవల బదిలీ అయిన జడ్జి సీహెచ్.రమేష్ బాబు 2022 మే 4 నుంచి సుదీర్ఘంగా వాదనలు వినడంతో విచారణ దాదాపుగా కొలిక్కి వచ్చింది. రెండేళ్ల పాటు సుదీర్ఘంగా వాదనలు విని తీర్పు వెల్లడించబోయే సమయంలో రమేష్ బాబు కూడా బదిలీ అయ్యారు. రేపటి నుంచి దాదాపు రోజూ విచారణ చేపట్టే అవకాశం ఉందని న్యాయవాదులు భావిస్తున్నారు.
పిటిషన్ల పరిష్కారానికి గడువు విధించినా: సీబీఐ కోర్టులో పెండింగ్లో ఉన్న డిశ్చార్జి పిటిషన్లను పరిష్కారించేందుకు గతంలో గడువు విధించినా ప్రయోజనం లేకపోయింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో పెండింగ్లో ఉన్న 130కు పైగా డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు పూర్తి అయినా తీర్పు వెలువడలేదు. తీర్పు వెలువరించాల్సిన సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. గత ఏడాది నవంబరు నుంచి ఒక్కదానిలోనూ తీర్పు వెల్లువడలేదు.
పదకొండేళ్లుగా విచారణ: ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వి.విజయ సాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్ అధికారులు మన్మోహన్‌సింగ్, బీపీ ఆచార్య, శామ్యూల్, జి.వెంకట్రామిరెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తలు దాదాపు 130కు పైగా డిశ్ఛార్జి పిటిషన్లను దాఖలు చేశారు. 2013వ సంవత్సరం నుంచి దాఖలైన డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ ఇప్పటి వరకు పూర్తికాలేదు.