Young Man Married Minor Girl for Relatives in AP : ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక (17) ఇంటికెళ్లిన యువకుడితో బంధువులు తాళి కట్టించారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గన్నవరం మండల పరిధిలో ఓ బాలికకు తల్లి లేకపోవడంతో మేనత్త దగ్గర ఉంటోంది. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలిక ఇంటికి సూరంపల్లి గ్రామానికి చెందిన గుర్రం శ్రీకాంత్ అనే యువకుడు తరుచూ రావడాన్ని చుట్టుపక్కల వారు గమనిస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా బాలిక ఇంటికి వచ్చిన యువకుడిని బంధువులు అదుపులోకి తీసుకొని తాళ్లతో బంధించారు. అనంతరం బాలికను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. వేర్వేరు కులాలు కావడంతో యువకుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా తాళి కట్టాల్సిందేనని పెద్దల సమక్షంలో యువకుడితో బాలికకు తాళి కట్టించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం సీఐ శివప్రసాద్ నుంచి విజయవాడ కృష్ణలంకకు చెందిన ఐసీడీఎస్ ఉజ్వల హోమ్ ప్రతినిధులు పూర్తి వివరాలు సేకరించారు. బాలికను హోమ్‌కు తరలించగా, దీనిపై ప్రస్తుతానికి పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి కేసు నమోదు కాలేదు.