Sandeep Kumar excels in furniture business : ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ ఇబ్బందులు, వ్యాపార ఆలోచన చేయొచ్చుగా అనే సలహా ఇచ్చాడో ఆత్మీయుడు. ధైర్యం చేసి ప్రయత్నాలు మెుదలు పెట్టాడు సందీప్‌కుమార్. కొవిడ్ కారణంగా సతమతమైనా, తట్టుకుని నిలబడి అంకురాన్ని లాభాల బాటపట్టించాడు. సామాజిక మాధ్యమాల వేదికగా వినూత్నంగా ప్రచారం చేస్తూ, నాణ్యమైన ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తున్న ఆ యువ వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
ఇంట్లో ఉండే ఫర్నీచర్‌నే స్టేటస్‌కి సింబల్స్‌గా ఫీల్ అవుతారు చాలా మంది. అప్పు చేసైనా సరే ఆహా అనిపించే ఫర్నీచర్ ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. అయితే ఆహా అనిపించే ఫర్నీచర్‌తో పాటు నాణ్యతగా ఉంటూ తక్కువ ధరకే దోరుకుతే ఎలా ఉంటుంది. అచ్చం ఇలాంటి ఆలోచనే చేసి సక్సెస్ అయ్యాడు ఇతడు. నాణ్యతను లాభాలను సమపాళ్లంలో చూసుకుంటూ వినూత్నంగా ముందుకు వెళ్తున్నాడు ఈ యువ వ్యాపారవేత్త.
ఈ యువకుడు బట్ట సందీప్‌కుమార్. స్వస్థలం విజయనగరం. ఉపాధి కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ జీడిమెట్ల సమీపంలోని చింతల్‌కు వలసొచ్చారు. కెరీర్ కోసం బీటెక్ చదువుతూనే పార్ట్‌టైంగా మొబైల్ షాపు, కాల్ సెంటర్‌లో పనిచేసి కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలిచాడు. కానీ, ఆ చిన్నపాటి ఉద్యోగాలు జీవితంలో ఎదగడానికి ఏం మాత్రం సరిపోక చాలా ఇబ్బందులు పడ్డాడు.
బీటెక్ పూర్తి చేశాక.. శ్రేయోభిలాషి సతీష్ సలహా మేరకు వ్యాపార ఆలోచన చేశాడు సందీప్. ఫర్నీచర్ మార్కెటింగ్‌పై అవగాహన సంపాదించుకున్నాడు. నమ్మకం వచ్చాక ధైర్యం చేసి 2019 లో 20 లక్షల రూపాయల పెట్టుబడితో జీడిమెట్లలో బటాస్ లగ్జరీ మ్యాట్రెసెస్, సోఫా అంకురం ప్రారంభించాడు. కొద్దిరోజులకే కొవిడ్ మహామ్మారి అడ్డురావడంతో లక్షల్లో నష్టపోయాడు. అయినా తట్టుకుని నిలబట్టాడు. శ్రేయోభిలాషి సతీష్, సోదరుడు రోహిత్‌కుమార్, మిత్రులు సాధిక్‌లు ఈ ప్రయాణంలో వెన్నంటే నిలిచారని అంటున్నాడు.
YUVA : అమ్మపాడే జోలపాటతో నెట్టింట్లో సంచలనం - ఆ సింగర్ ఎవరో తెలుసా? - Amma Pade Jola Pata Singer Jahnavi
నాణ్యతకు పెద్దపీట వేసి వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఫర్నీచర్ వ్యాపారం నడుపుతున్నాడు సందీప్. డ్యూరోఫ్లెక్స్ సేఫ్టీ మ్యాట్రెస్, నేచురల్ లాటెక్స్ మ్యాట్రెస్, స్ప్రింగ్ మ్యాట్రెస్, లాటెక్స్ ఫిల్లోస్, కుషన్స్, చాపలు, కర్టెన్లు వంటివి తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నాడు. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ రావడంతో పటాన్‌చెరువు, కూకట్‌పల్లి, గండిమైసమ్మ ప్రాంతాల్లో యూనిట్లను నెలకొల్పాడు.
వినూత్నంగా ఆలోచించి డిస్టిబ్యూటర్ల వ్యవస్థ లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశా. కస్టమర్లు ఫోన్‌లో సంప్రదించి బుక్ చేసుకోవడం లేదా నేరుగా వచ్చి నచ్చే రీతిలో అందంగా ఫర్నిచర్ డిజైనింగ్ చేసుకునే సదుపాయం ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీతోపాటు మార్కెట్ పోటీ తట్టుకునేందుకు సోఫాలోనూ లాటెక్స్ ఉపయోగిస్తున్నాం- సందీప్ కుమార్, వ్యాపారవేత్త
ఒక్కడిగా వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు 30 మందికిపైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు సందీప్. కుటుంబ సభ్యులూ ఈ వ్యాపారం పనుల్లో భాగస్వాములు అయ్యాడు. సోదరుడు రోహిత్ సోఫా వ్యాపారం చూసుకుంటుంటే... సందీప్ భార్య స్వాతి సోషల్ మీడియా, అకౌంట్స్ చూస్తూ తోడ్పాటు అందిస్తున్నారు. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా వినియోగదారుల సంతృప్తి లక్ష్యంగా పని చేస్తున్నాడు సందీప్. థాయిలాండ్ నుంచి లాటెక్స్, రష్యా నుంచి కలప నేరుగా దిగుమతి చేసుకుంటూ, మన్నికైన హైడెన్సిటి ఫోమ్స్‌ని ఫర్నిచర్ కోసం ఉపయోగి స్తున్నారు.
ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు సందీప్. జీవితంలో ఏదైనా సాధించాలి.. తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేసి విజయం సాధించాడు. సామాజిక మాధ్యమాలను వారధిగా చేసుకుని.. బిజినెస్ టూ కస్టమర్ పద్ధతిని అనుసరించాడు. ఇదే స్ఫూర్తితో తన వ్యాపారాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే పనిలో ఉన్నాడు ఈ యువ వ్యాపారవేత్త.