Young Man Suicide in Mundlamuru : నేటి యువత చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతోంది. ప్రేమ విఫలమైందని ఒకరు, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు, తల్లిదండ్రులు మందలించారని, ఉద్యోగం రాలేదని ఇంకొందరు. ఇలా వివిధ కారణలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న తల్లిందండ్రులను విషాదంలోకి నెట్టేస్తున్నారు.
తాజాగా ఆ నవ యువకుడి కలలన్నీ కల్లలయ్యాయి. డిగ్రీ చేసి మూడు సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఏవీ ఫలించలేదు. బేల్దారీ పనులు చేయలేక తల్లిదండ్రులకు భారం కాలేక మనోవ్యథకు గురయ్యాడు. తన ఆవేదనకు అక్షరరూపమిచ్చి తనువు చాలించాడు. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
A Man Committed Suicide in Prakasam : ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వెల్లంపల్లి సురేష్(25) మూడు సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఏవీ ఫలించలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో అక్కడే బేల్దారి పనులకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం స్వగ్రామానికి వచ్చాడు. తల్లిదండ్రులు వేంపాడు వద్ద కౌలుకు తీసుకున్న పొలంలో పనులకు వెళ్లారు. ఆదివారం రాత్రి ఏడు గంటలకు ఇంటికొచ్చారు. తలుపులు వేసి ఉండటంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్ రాడ్డుకి కుమారుడి మృతదేహం వేలాడుతుండటంతో వారు ఆందోళనకు గురయ్యారు. తలుపులు పగులగొట్టి వెళ్లగా సురేశ్ ఉరేసుకొని కన్పించాడు. ఇదిచూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా హతాశులయ్యారు.
అక్కడ ఓ సూసైడ్ నోటు లభించింది. అందులో తన చావుకి ఎవ్వరూ కారకులు కాదని పేర్కొన్నాడు. ఉద్యోగం రాకపోవడంతో తల్లిదండ్రులు, అన్నయ్యకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నానని ఆ బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాశాడు. ప్రేమించిన అమ్మాయికి ఇటీవల ఉద్యోగం వచ్చినా తనకు రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు పేర్కొంటున్నారు. ఎస్ఐ నాగరాజు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తండ్రి యలమంద ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో పరిచయమైన ఆంధ్రా జంట - "మహి, శైలు" మీరెందుకిలా చేశారు?
ప్రేమ పేరుతో బాలుడి వేధింపులు - ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య