YOUNG MAN SUICIDE IN Yadadri Bhuvanagiri : ఎన్నికల్లో డబ్బులు తరలిస్తున్నారని సమాచారం ఇచ్చాడని రంజిత్ అనే యువకుడిని నిలదీయడంతో అతను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం, మర్రిపడగ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న కీసర ఓఆర్ఆర్ పక్కన గల కరీంగూడ చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనంపై బ్యాగులో డబ్బును తీసుకుని వెళ్తున్న సాయికుమార్, కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. డబ్బును తీసుకెళ్తున్న వారి వద్ద లభించిన బ్యాగులో ఉన్న రూ.25లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో నుంచి 6.5 లక్షలను దాచి 18.5 లక్షలు దొరికినట్లుగా కీసర సీఐ ముందు ప్రవేశపెట్టారు. దీంతో పట్టుబడిన సాయి కుమార్, కార్తీక్‌లను విచారించగా బ్యాగులో రూ.25 లక్షలు ఉన్నట్లుగా తెలిపారు. రూ.6.5 లక్షలు కానిస్టేబుల్ శ్రీకాంత్ యాదవ్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణలు తీసుకున్నట్లుగా తెలపడంతో సీఐ వెంకటయ్య దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న రాచకొండ పోలీసు కమిషనర్ సీపీ తరుణ్ జోషి, ఈ అంశంపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని మల్కాజిగిరి డీసీపీ పద్మజకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ చేపట్టిన డీసీపీ కానిస్టేబుల్లు డబ్బు దాచి ఉంచిన సంగతి నిజమేనని నివేదిక ఇవ్వడంతో కానిస్టేబుల్ శ్రీకాంత్‌తో సహా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
డబ్బు తరలిస్తున్నారన్న సమాచారం కానిస్టేబుల్లకు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారించగా చెంగిచర్లకు చెందిన రంజిత్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో డబ్బు పట్టుబడిన వ్యక్తి రంజిత్‌ను సాయికుమార్, కార్తీక్ నిలదీయడంతోనే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. కాగా యువకుడి తల్లి తన కుమారుడు ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులకు తెలపడం గమనార్హం. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి పోలీసులు తెలిపారు. కాగా రంజిత్ ఆత్మహత్యకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.