Yellandu Hospital Problems In Bhadradri Kothagudem : ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నవాళ్లకు జబ్బు చేస్తే ప్రైవేటు ఆసుపత్రిలో చూయించుకుంటారు. మరి పేదవారికి జబ్బు చేస్తే సర్కారు దవాఖానే దిక్కు. ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లందులో ప్రభుత్వాస్పత్రికి వెళ్తున్న రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు వెచ్చించలేక ప్రభుత్వాస్పత్రికి వెళ్తున్న బాధితులను డాక్టర్ల కొరత వేధిస్తోంది.
దానికి తోడు సదుపాయాల లేమి వెరసి చికిత్స కోసం గంపెడాశతో వెళ్లిన రోగులకు అవస్థలు తప్పడం లేదు. మరోపక్క ఆస్పత్రిలో నిధులు లేకపోవడం సమస్యగా మారింది. వైద్య విధాన పరిషత్ పరిధిలోని వైద్యశాలలకు రూ.5 లక్షల వరకు నిధులు అందాల్సి ఉంది. డయాలసిస్ సెంటర్‌కు సైతం నిధులు విడుదల కాక ఆస్పత్రిలో డయాలసిస్ సేవలకు ఇటీవల తీవ్ర అంతరాయం కలిగింది.
తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం - అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి
Yellandu Govt Hospital problems : ఇల్లందు ప్రభుత్వాస్పత్రి వైద్యవిధాన పరిషత్‌లోకి మారినా, వైద్యుల సంఖ్య పెరగలేదు. ఓపీలు మాత్రం రోజుకు 500 పైగానే వస్తున్నాయి. ఇల్లందు నియోజకవర్గంతో పాటు గుండాల, ఆళ్లపల్లి, కారేపల్లి మండలాల నుంచి రోగులు వస్తుంటారు. అత్యవసర వైద్య సేవల కోసం వచ్చేవారికీ ఇక్కడ ఊరట లభించడం లేదు. వైద్యశాలలో 13 మంది వైద్యుల నియామకం జరిగినా, కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
కూకట్‌పల్లిలో పిక్సెల్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన తనికెళ్ల భరణి
Yellandu Govt hospital problems : మరికొందరు ఒక్కో రోజు ఒక్కో వైద్యశాలలో విధులు నిర్వహిస్తూ రోజు విడిచి రోజు వస్తుండటంతో వైద్య సేవలకు అంతరాయం కలుగుతోంది. దాంతో రోగులను ఖమ్మం, వరంగల్ వెళ్లాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన వారు చాలామందే ఉన్నారు. అలాగే వ్యయ ప్రయాసలకోర్చి అంతదూరం వెళ్లి రావాలంటే తమకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మార్చి, ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు బాసటగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సహా స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇల్లందు ప్రభుత్వాస్పత్రిని 100 పడకలకు పెంచాలని గత ప్రభుత్వ హయాంలో నాటి వైద్యశాఖ మంత్రి హరీష్ రావుకు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ విజ్ఞప్తి చేశారు. దాంతో అప్పటి ప్రభుత్వం రూ. 37.50 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జరిగిన ఈ పరిణామంలో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. 100 పడకల ఆస్పత్రిగా మారితే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయని ఈ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్నారు.
కొత్త వేరియంట్‌తో భయం వద్దు - జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్న వైద్యులు