Yadadri Sravana Masam Poojalu 2024 : శ్రావణ మాసం వ్రతాల నిర్వహణకై పంచ నారసింహుల స్వయంభూ క్షేత్రమైన యాదాద్రి సంసిద్ధం అవుతోంది. వైష్ణవ, శైవ భక్తుల ఆశీర్వాదానికి హరిహర ఆలయాలు, అమావాస్య దీపారాధనతో సిద్ధమయ్యాయి. మహా దేవుడు శుభదాయకమని పండితులు చెబుతున్నారు.
దేవతులు సముద్ర మథనం చేపట్టినపుడు వెలువడిన హాలాహాలంను లోక సంరక్షణకు శివుడు సేవించిన మాసం శ్రావణం. అందుకే శ్రావణ సోమవారాన్ని పర్వదినంగా, శివారాధనకు ప్రాధాన్యతనిస్తారు. శనివారం తిరుమలేశ్వరుడు, యాదాద్రీశులను కొలుస్తారు. ఇలా శివ, కేశవుల ఆరాధన మాసంగా శ్రావణం ప్రత్యేక ఆదరణ పొందింది. మంగళవారం మంగళగౌరీ వ్రతం, శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం ఆచారం.
మూడు రోజులపాటు ప్రవిత్రోత్సవాలు : ఆలయ పవిత్రోత్సవాలు ఆదే మాసంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మూడ్రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలను శాస్త్రోక్త వైభవంగా చేపడుతారు. ఏడాదంతా నిర్వహించే ఆలయ ఆరాధనల్లో ఏవైన పొరపాట్లు జరిగితే వాటి నివారణకై ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 14 నుంచి 16 వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి.
26, 27న శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కొనసాగుతాయి. ఈనెల 6న మంగళగౌరీ వ్రతం, 7న ఆండాళ్ తిరునక్షత్రం, 8న నాగుల చవితి, 9న గరుడ పంచమి వేడుకలు, 11న స్వాతి నక్షత్రోత్సవం, 16న వరలక్ష్మీవ్రతం చేపడుతారు. శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణకు ఆసక్తి వహిస్తారు. సామూహిక వ్రతాల నిర్వహణకు యాదాద్రి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
స్నానసంకల్పం : మరోవైపు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండ మీద ఉన్న విష్ణు పుష్కరిణి వద్ద భక్తుల కోసం స్నానసంకల్పాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించే దంపతులు లేదా ఇద్దరికి పురోహితులతో గోత్ర నామాల సంకల్పం నిర్వహించడంతో పాటు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్వామివారి లడ్డూ సదుపాయం కల్పిస్తామని ఈవో భాస్కర్ రావు తెలిపారు. స్నాన సంకల్పం టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. దీన్ని ఆగస్టు 11వ తేదీ స్వాతి నక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని కూడా ఆరోజే ప్రారంభించ నుండగా దానికి సంబంధించిన పనులను ఆలయ అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు.