Women Use Drugs in Hyderabad : ఇటీవలి కాలంలో మహిళలూ డ్రగ్స్ స్కామ్‌లలో ఇరుక్కుపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినవి నిజ జీవితంలో జరుగుతుంటే మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన యువతి ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఐటీ కొలువు రావటంతో నగరం చేరింది. మిత్రుల ప్రభావంతో నెమ్మదిగా మాదక ద్రవ్యాలకు అలవాటైంది. వారానికోసారి ఆ కిక్ లేకుండా ఉండలేని స్థితికి చేరింది. కొద్దిరోజుల క్రితం దూల్‌పేట్‌లో గంజాయి కొనేందుకు వెళ్లి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడింది. గట్టిగా ప్రశ్నిస్తే స్నేహితుల కోసం సరకు తీసుకెళ్లేందుకు వచ్చానంటూ అసలు విషయం బయటపెట్టింది. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెబితే, తమ కూమార్తె అమాయకురాలంటూ వాదించారు. చివరకు వైద్య పరీక్షలో రుజువు కావటంతో విలవిల్లాడారు.
ముషీరాబాద్‌కు చెందిన మహిళ ఒత్తిడి నుంచి బయటపడేందుకు నిద్రమాత్రలు తీసుకునేది. మరింత మత్తు కోసం ఓ సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన స్నేహితుడి సూచనతో ఎల్ఎస్డీ బ్లాట్స్‌కు దగ్గరైంది. క్రమంగా ఇద్దరూ కలిసి గోవా, ముంబయి, బెంగళూరు వెళ్లి రావటం ప్రారంభించారు. ఆమె అలవాటును అవకాశంగా మలచుకున్న అతడు, డ్రగ్స్ సరఫరాకు ఏజెంట్‌గా మార్చుకున్నాడు. నగరంలో 50 మందికిపైగా ఇతడి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించిన టీజీ న్యాబ్ పోలీసులు నిఘా ఉంచి వీరిద్దరినీ అరెస్ట్ చేశారు.
Women are Drug Agents in Hyderabad : ఇవన్నీ ఒకెత్తైతే మత్తుకు అలవాటైన అమ్మాయిలను స్మగ్లర్లు పావులుగా వాడుకుంటున్నారు. పోలీసు తనిఖీల నుంచి తప్పించుకొని సరకు సురక్షితంగా గమ్యానికి చేర వేసేందుకు ఏజెంట్లుగా మలుచుకుంటున్నారు. విలాసవంతమైన జీవితం, ఉచితంగా మత్తును ఆస్వాదించవచ్చని ఆశ చూపి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త దుబాయ్‌లో ఉండేవాడు. ఒంటరిగా ఉన్న ఈమె పబ్‌లలో తిరిగి డ్రగ్స్‌కు అలవాటైంది. అక్కడ పరిచయమైన యువకుడి ప్రోత్సాహంతో డ్రగ్స్ చేరవేస్తూ టీజీ న్యాబ్‌కు పట్టుబడింది. కౌన్సెలింగ్ ద్వారా ఆమెను మార్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇటీవల ఆమెకు ఆకస్మికంగా చేసిన వైద్య పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్టు సమాచారం. నార్సింగి ప్రాంతంలో ఓ సంగీతం టీచర్ డ్రగ్స్ తీసుకొనేది. ఆమె స్నేహితుడు దీన్ని ఆసరా చేసుకొని ఏజెంట్‌గా మార్చాడు.
Reasons of Women Take Drugs : పోలీసుల గణాంకాల ప్రకారం నగరంలో గంజాయి, కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డీ బ్లాట్స్ వాడుతున్న ప్రతి 100 మందిలో 40 మంది మహిళలు, యువతులున్నట్టు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్న మహిళలే అధికంగా మత్తు ముఠాల బారిన పడుతున్నట్టు దర్యాప్తులో నిర్దారించారు. నైజీరియన్ ముఠాలు, అంతర్రాష్ట్ర ముఠాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచడంతో సరకును ఇలా బాధిత మహిళల చేత రవాణా చేయిస్తుండటం ఆవేదన కలిగించే అంశాలంటున్నారు పోలీసులు. మహిళలు ఇలాంటి ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.