Women Inspirational Story of Para Athlete Bhavani Nellore : కలిమిలేముల మాట ఎలా ఉన్నా అవయవాలన్నీ సక్రమంగా ఉండి అన్నీ పని చేస్తున్నప్పుడు, అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్నప్పుడు అవకాశాల్ని అందిపుచ్చుకోవడం, విజేతలుగా నిలవడం సహజమే. కానీ, సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ విజేతలవ్వడం కొందరికే సాధ్యం. అందుకు ఉదాహరణే భవాని. ఓ ప్రమాదంలో చేతినీ, ఎంతగానో ఇష్టపడే తండ్రినీ కోల్పోయినా పారా అథ్లెట్‌గా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో దూసుకుపోతోన్న ఈ క్రీడా కెరటం. తన గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
లోపాన్ని అధిగమించి ఆ స్ఫూర్తిని మరికొంతమందికి అందించమని చెప్పిన అమ్మ మాట, ‘ఆటల్లో దేశానికి పతకం తీసుకురావాలన్న’ నాన్న కోరికనూ నెరవేర్చాలనే తపనతో ముందుకు సాగుతున్నానంటుంది భవాని. తనది నెల్లూరు జిల్లా ముత్తుకూరు. నాన్న చంద్రయ్య, అమ్మ బుజ్జమ్మ. వాళ్లిద్దరూ కూలి పనులకు వెళ్తేనే కానీ పూటగడవని కుటుంబం.
నాన్నకు ఆటలంటే ఇష్టం. ఆయన ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచీ క్రీడల్లో పాల్గొనడం ప్రారంభించింది భవాని. ఐదోతరగతికి వచ్చేసరికి జిల్లాస్థాయిలో మొదటి స్థానం సాధించింది. అప్పుడు తన తండ్రి భుజాలపై ఎత్తుకుని మా కాలనీ అంతా ఊరేగించి సంబర పడిపోయారు. ఏదో ఒకరోజు నా కూతురు దేశం కోసం పతకాలు తెస్తుందని గొప్పగా చెప్పేవారు. నేనూ అంతే ఎప్పుడూ ఆటల్లోనే మునిగితేలేదాన్నని చెప్తుంది. ఇలా హాయిగా సాగిపోతోన్న తన జీవితాల్ని ఓ ప్రమాదం తలకిందులు చేసేసింది.
ఆ బాధే ఎక్కువ : 2009 అప్పటికి భవానికి పదేళ్లు. ఆ రోజు స్కూలుకి సెలవు కావడంతో స్నేహితులంతా కలసి అక్కడే ఉన్న ఓ లారీ ఎక్కి ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా ఏమయ్యిందో ఏమో కానీ, ఓ విద్యుత్ తీగ తెగి తన మీద పడిపోయింది. అందరూ భయంతో కేకలు వేస్తున్నారు. తన దగ్గరికి వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. తన తండ్రి తనను కాపాడుకోవాలని ఏవో ప్రయత్నాలు చేస్తూ, ఆయనా షాక్‌కి గురయ్యారు. ఆపై కాసేపటికి ప్రాణాలు వదిలేశారు. ఒళ్లంతా గాయాలైన తనను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు కుడి చేతిని భుజం వరకూ తీసేశారు. దానికంటే నాన్న లేరని తెలిసి బాధపడిందే ఎక్కువ. తన అమ్మ మాత్రం బాధను గుండెల్లోనే దిగమింగుకుంది. తనలో మనో నిబ్బరం కలిగించడానికి చేయని ప్రయత్నం లేదు. మరోపక్క తండ్రి లేకపోవడంతో ఆర్థికంగానూ చితికిపోయానంటుంది.
శభాష్ - అభాగ్యులకు ఆత్మ బంధువు 'మన ఇల్లు'
ఎన్నో కష్టాలు : రెండు నెలలకు నెమ్మదిగా కోలుకుంది. కానీ, స్నేహితులంతా దూరమయ్యారు. ఆటలు లేవు. దాంతో బయటికే వెళ్లాలనిపించేది కాదంటుంది. ఒంటరిగా ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేది. తన పరిస్థితి చూసి అమ్మ భయపడింది. తనకు చేయి లేదనే లోపాన్ని మరచిపోయేలా చేయాలనుకుంది. ఆటల్లో పడితే తిరిగి మామూలు మనిషిని అవుతుందని నమ్మింది. తనను ఒప్పించి మైదానానికి పంపించింది. తను కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఒక్కోసారి కూలి పనులకు కూడా వెళ్లలేకపోయేది. అయినా, నిత్యం తన మాటలతో భవానికి ధైర్యం నూరిపోసేది. అమ్మ శ్రమను చూశాక తనలో కసి పెరిగింది. సెలవుల్లో తనకి తోడుగా పనులకు వెళ్లేది.
ఇంటర్ నుంచి పత్రికలు చదవడం అలవాటయ్యింది. ఈ క్రమంలోనే పారాలింపిక్ క్రీడాకారిణుల విజయగాథల్ని ఈనాడు వసుంధరలో చదివానంటుంది. అవి తనలో స్ఫూర్తినింపాయని, లక్ష్యాన్ని ఏర్పరిచాయంటుంది. డిగ్రీ మొదటి ఏడాదిలో ఉండగా పారాక్రీడాకారుల శిక్షణకు సంబంధించిన నోటిఫికేషన్ పత్రికలో చూసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోచ్ జస్పిం సాయంతో శిక్షణ తీసుకోవడం ఆరంభించింది. రోజూ వాళ్ల ఊరి నుంచి నెల్లూరు వెళ్లి సాధన చేసేది. ఏలూరులోని స్టేడియంలో జరిగిన పోటీల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి పతకం సాధించింది. అలా 2018 నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం ఆరంభించింది.
2023లో అంతర్జాతీయ స్థాయి పోటీలకు అవకాశం వచ్చింది. ఎంట్రీ ఫీజు కోసం అప్పు చేసి థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ ఎబిలిటీ సపోర్ట్ గేమ్స్‌లో ఆడి కాంస్యం అందుకుంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ పోటీల్లో వంద మీటర్ల పరుగు పందెంలో వెండి, లాంగ్ జంప్‌లో కాంస్య పతకాలు సాధించింది. నిజానికి పరుగు పందెంలో వేగం పెరగాలంటే రెండు చేతులూ అవసరం. కానీ ఒక్క చేత్తో నెగ్గుకు రావడం కష్టమే. అయినా కఠోర సాధనతో అది సాధ్యమయ్యింది. నిన్నటివరకూ 'వైకల్యంతో నువ్వేం ఆడతావ్, కూర్చుని చదువుకుని ఉద్యోగం సాధించుకో అని సలహా ఇచ్చిన వారితోనూ శభాష్ అనిపించుకుంది. డిగ్రీ పూర్తయ్యింది. ఇక, పారాలింపిక్ క్రీడల్లో పతకాన్ని సాధించింది. దేశం, నాన్న రుణాన్ని తీర్చుకోవడమే తన ముందున్న లక్ష్యంమంటుంది భవాని.