Woman Stopped Deputy CM Pawan Kalyan Convoy : ఓ మహిళ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్కి ఎదురుగా వెళ్లి తమ కుమార్తెకు న్యాయం చేయాలని వేడుకోగా, పర్యటన ముగించుకొని వచ్చి మీ సమస్యకు పరిష్కారం చూపుతానని డిప్యూటీ సీఎం చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే వచ్చి బాధిత కుటుంబ మహిళను కలిసి ఆమె చెప్పిన విషయాలను ఆలకించి అండగా ఉంటానని, న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గత నెల అక్టోబరులో ఓ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనికి బాధిత యువతి తల్లిదండ్రులు మాత్రం విద్యా సంస్థ వేధింపులే కారణమని ఆరోపించారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లి వేడుకున్నారు. ఆయన ఈ విషయంపై స్పందించి, బాధిత కుటుంబంతో మాట్లాడి న్యాయం చేస్తానని మాటిచ్చారు. ఈ సంఘటన ఏపీలోని డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా చిలకలపాడుకు చెందిన చెక్కపల్లి శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు. వారిలో చిన్న కుమార్తె వెన్నెల శ్రీషిర్డీసాయి విద్యానికేతన్‌లో పదో తరగతి చదివేది. దసరా సెలవులు అన్ని పాఠశాలలకు ఇచ్చి, తాను చదివే స్కూల్‌కు ఇవ్వకపోవడంతో గత నెల ఆరో తేదీన కలెక్టర్‌కు వెన్నెల ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. తమకు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయింది.
ఈ విషయంపై కలెక్టర్ పాఠశాల యాజమాన్యంతో చర్చించడంతో ఆ మర్నాటి నుంచే పాఠశాలకు సెలవులు ప్రకటించారు. సెలవులు పూర్తి అయిన తర్వాత 14వ తేదీన తిరిగి పాఠశాలకు బాలిక వెళ్లింది. ఆ బాలికను స్కూల్ డైరెక్టర్ ఉమారాణి పిలిచి కలెక్టర్‌కు ఎందుకు ఫిర్యాదు చేశావని ప్రశ్నించింది. ఇలా ప్రశ్నించడంతో పాటు పదో తరగతి ఫెయిల్ చేస్తామని బెదిరించిందని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ఏం చేయాలో తెలియక బాలిక 18వ తేదీన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో పాఠశాల యాజమాన్యం కారణంగానే తమ కుమార్తె మరణించినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ : ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించిన కుటుంబ సభ్యులు పవన్ కల్యాణ్ శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లారు. తమ సమస్యను ఉపముఖ్యమంత్రి పవన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పవన్‌కు వినతి పత్రం అందించేందుకు కాన్వాయ్కి అడ్డుపడి న్యాయం చేయాలని వేడుకున్నారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం, తిరుగు ప్రయాణంలో ఇక్కడికే వస్తానని, సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. దీంతో వారు అక్కడే వేచి ఉండగా, సాయంత్రం వచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వారితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.