Woman Misses Accident at Navandgi Railway Station : ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో కొందరు మాత్రమే అదృష్టవశాత్తు బతికి బట్ట కడుతున్నారు. మరీ ముఖ్యంగా అనుకోకుండా జరిగే రైలు ప్రమాదాల్లో బతికి బయటపడటమే అసాధ్యమే. కానీ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నావంద్గి రైల్వే స్టేషన్ పరిధిలో ఓ గిరిజన మహిళ అదృష్టవశాత్తు బతికింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నావంద్గి రైల్వే స్టేషన్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది.
రైల్వే స్టేషన్ సమీపంలో టాకీ తాండాకు చెందిన ఓ మహిళ బషీరాబాద్ నుంచి రైల్వేస్టేషన్ అవతలి వైపు వెళ్లాలనుకుంది. అందుకు పట్టాలపై నుంచే వెళ్లేందుకు ముందుకు సాగింది. అయితే పట్టాలపై అప్పటికే ఓ గూడ్స్ రైలు ఆగి ఉంది. రైలు ఆగే ఉంది కదా అని ఆ మహిళ ఆ రైలు కింది నుంచి పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది.
సేఫ్‌గా బయటపడి సోషల్ మీడియాలో హల్చల్ : అదే సమయంలో ట్రైన్ కదలింది. మహిళ షాక్‌కు గురి కాకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. వెంటనే అప్రమత్తమై ధైర్యంగా పట్టాల మీద పడుకుంది. ఏమాత్రం తలను, శరీరాన్ని పైకి లేపకుండా పట్టాలకు అతుక్కుపోయింది. ఊపిరి బిగబట్టి, స్థానికుల సూచనలు పాటిస్తూ ధైర్యంగా అలాగే పట్టాలకు అతుక్కుపోయింది. గూడ్స్ ట్రైన్ తనపై నుంచి పూర్తిగా వెళ్లేంత వరకు అలాగే ఉంది.
రైలు వెళ్లిందని స్థానికులు చెప్పగానే ఊపిరి పీల్చుకుని హమ్మయ్య, బతికి బట్టగాను దేవుడా అంటూ పట్టాలపై నుంచి లేచింది. అలా ఆ మహిళ సేఫ్‌గా ఈ ప్రమాదం నుంచి బయట పడింది. ఈ సంఘటనను అక్కడున్న కొందరు స్థానికులు తమ మొబైల్స్‌లో వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వావ్.. హ్యాట్సాఫ్ అంటూ ఆ మహిళ తెగువను ప్రశంసిస్తున్నారు. నీ గుండె ధైర్యానికి మా దండం తల్లీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయమై ఎటువంటి సమాచారం అందలేదని స్టేషన్ మాస్టర్ ఈటీవీ భారత్‌కు తెలిపారు.