Leopard Attack on Woman : మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులతో తెలంగాణ సరిహద్దు జిల్లాలు బెదిరిపోతున్నాయి. పులుల దాడుల్లో అనేక మంది గాయాల పాలవుతుండగాా, కొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల దాడులు పెరిగిపోయాయి. తాజాగా బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళపై చిరుత పులి దాడి చేసింది. జిల్లాలోని బజార్‌హత్నూర్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, డేడ్రా గ్రామానికి చెందిన అర్క బీమాబాయి శనివారం ఉదయం గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లారు. అక్కడే మాటు వేసి ఉన్న చిరుత పులి ఆమెపై ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో ఆమె పెద్ద ఎత్తున కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఆమె కేకలు విన్న గ్రామస్థులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. ఆమె ముఖంపై తీవ్ర గాయం కాగా, గ్రామస్థులు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
వెంటనే గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పరిసరాలను పరిశీలించారు. ప్రజలకు అటవీ శాఖ అండగా ఉంటుందని డీఆర్‌వో ప్రవీణ్ తెలిపారు. బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఒంటరిగా, చీకట్లో బయటకు వెళ్లవద్దని అటవీ శాఖ సిబ్బంది పరిసర గ్రామాల ప్రజలకు సూచించారు.
చిరుతపులి దాడి ఘటనపై మంత్రి సురేఖ దిగ్భ్రాంతి : ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం డెడ్రా గ్రామంలో మహిళపై జరిగిన దాడి ఘటనపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేయాలని అటవీ అధికారులకు ఆదేశాలిచ్చారు. చిరుత కదలికలపై నిఘా పెట్టాలని పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్‌ను మంత్రి సురేఖ ఆదేశించారు. దాడి చేసిన చిరుత మహారాష్ట్ర సరిహద్దు నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించిందని పీసీసీఎఫ్ తెలిపారు.
మరో వ్యక్తిపై పెద్ద పులి దాడి - నిన్న యువతి - నేడు రైతు
ఓవైపు చిరుత - మరోవైపు పెద్ద పులి - క్షణక్షణం భయం భయంగా గడుపుతున్న గ్రామస్థులు