Woman Loses RS. 7.5 lakhs in Credit Card Cyber Crime : కొత్త రూట్ క్రైమ్‌లకు తెరలేపారు సైబర్ నేరగాళ్లు. ఇంతకాలం డెలివరీ, మాదకద్రవ్యాలు, నకిలీ పాస్‌పోర్టులు అంటూ కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు కొత్త పంథాలో డబ్బులు కాజేస్తున్నారు. ప్రక్రియ అంతా ఒక్కటే అయినా బెదిరింపుల రూట్ మార్చారు. ఈ మధ్యకాలంలో క్రెడిక్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీన్నే ఆసరాగా చేసుకుని దోచుకుంటున్నారు. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేదని, అది మనీలాండరింగ్ కిందకి వస్తుందని భయపెట్టి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్‌లో జరిగింది.
క్రెడిట్ కార్డు చెల్లింపుల పేరిట నగరానికి చెందిన బాధితురాలు రూ.7.5లక్షలు మోసపోయింది. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదవుతుందని బెదిరించిన సైబర్ నేరగాళ్లు అంత మొత్తాన్ని కాజేశారు. బాధితురాలితో సైబర్ నేరగాడు ఫోన్లో మాట్లాడి మీ క్రెడిట్ కార్డు నుంచి చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని బెదిరించాడు. దాంతో బాధితురాలు నాకు క్రెడిట్ కార్డు లేదని చెప్పింది.
సీబీఐ విచారణ అంటూ : అయితే కస్టమర్ కేర్‌తో మాట్లాడాలని సూచించి మరోవ్యక్తికి నేరగాడు కాల్ ఫార్వర్డ్ చేశాడు. అతను బాధితురాలి ఆధార్ తనిఖీ చేసి ముంబయి, తమిళనాడు, బిహార్‌తో పాటు మరోప్రాంతంలో ఆమె పేరిట క్రెడిట్ కార్డులు ఉన్నాయని వాటి నుంచి రూ.25 నుంచి రూ.30 లక్షల డబ్బు బదిలీ జరిగిందని బెదిరించాడు. మనీలాండరింగ్ ప్రకారం కేసు నమోదవుతుందని భయపెట్టాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని, సీబీఐ విచారిస్తున్నప్పుడు విషయం చాలా రహస్యంగా ఉంచాలని సూచించాడు. నమ్మిన యువతి వాళ్లు చెప్పినట్టుగానే చేసింది.
కేసు దర్యాప్తు చేస్తున్నామని, తాము సూచించిన అకౌంట్లో రూ.7 లక్షల50 వేలు ట్రాన్స్ఫర్ చేయాలని, దర్యాప్తు పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తామని చెప్పడంతో యువతి భయంతో డబ్బు చెల్లించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ తతంగమంతా బాధితురాలి మిత్రులతో పంచుకోవడంతో వారి సలహా మేరకు మోసపోయినట్లు గ్రహించి, న్యాయం చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఆందోళనకు గురికాకుండా 1930కి ఫోన్ చేయడం లేదా cybercrime.cgg.gov.inలో రిపోర్ట్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.