Squirrel Help Woman Video Viral : నేటి రోజుల్లో మనిషికి మనిషే సాయం చేసుకోవడం లేదు. అలాంటిది ఒక మనిషికి ఉడుత సాయం చేసి మనుషుల కన్నా జంతువులే ఎంతో విశ్వాసవంతమైనవని మరోసారి నిరూపించాయి. ఇలా మనుషులకు జంతువులు సాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక కోతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ముసలివాడికి సహాయం చేస్తోంది. అతనికి కర్ర అవసరం అయితే దానిని ఆ ఓల్డ్మెన్కు మంకీ అందిస్తుంది. ఇలా జంతువులు మానవుడికి సాయం చేయడం చాలాసార్లు చూశాం.
A woman always feeds this squirrel, and the squirrel returned the favor by leaving a cookie out for her..🐿️🍪😊 pic.twitter.com/pBF7vJWYgq
— schuld (@schuld_eth) August 22, 2024
తాజాగా ఓ మహిళ తను తినగా మిగిలిన ఆహారాన్ని ఉడుతకు పెడుతూ ఉండేది. ఇలా ఒక్కరోజే కాకుండా నిత్యం ఏదో ఒకటి పెడుతూ ఆ క్షీరదం కడుపు నింపుతూ ఉండేది. ఇలా ఆమె పెట్టిన చిన్న ముద్దకు విశ్వాసం చూపిందా ఉడతా. ఆమె ఏదో పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆలస్యంగా తిరిగి వస్తే ఉడుత చేసిన పనికి అంతా ఫిదా అవ్వాల్సిందే. తనకు అన్నం పెట్టిన వ్యక్తి ఆకలితో ఉంటుందేమోనని గ్రహించి ఒక కుక్కీని తీసుకువచ్చింది. దాన్ని ఆమె తలుపు తీసే కిటికీ ముందు కనిపించే విధంగా ఒక బాక్స్ లాంటిది ఎక్కి దానిని అక్కడ పెట్టింది.
కారు దిగి తలుపు తీయడానికి వచ్చిన ఆ మహిళకు బిస్కెట్ కనిపించి షాక్కు గురైంది. అది ఎవరు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారోనని చుట్టూ చూసింది. చివరికి సీసీ కెమెరాలో చూడగా ఒక ఉడుత ఆ బిస్కెట్ను తీసుకొచ్చి అక్కడ పెట్టిన దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ఉడుత చేసిన పనికి సలాం కొడుతున్నారు. ఈ క్రమంలో ఉడుతపై ఒక కథను చెప్పుకోవాల్సిందే. అదేనండీ ఉడుత భక్తి.
ఉడుత భక్తి : చరిత్రను ఒక్కసారి చూస్తే రామాయణంలో సీతను రావణాసురుడు లంకకు ఎత్తుకుపోతాడు. సీత లంకలో ఉందన్న విషయం తెలుసుకున్న శ్రీరాముడు సముద్రం దాటి లంకకు చేరుకోవాలని అనుకుంటాడు. అప్పుడు వానరుల సహాయంతో వారధి నిర్మించాలని రాముడు సంకల్పిస్తాడు. వానరులు వారధి కట్టడానికి రాళ్లను సముద్రంలో పడేస్తారు. అప్పుడు అక్కడే ఉన్న చిన్న ఉడుత నేను కూడా ఈ దైవ కార్యంలో పాలుపంచుకోవాలని, తనకు తోచిన సాయం చేస్తానని అనుకుంటుంది.
వెంటనే సముద్రం వద్దకు వెళ్లి వానరులు రాళ్లు వేస్తుంటే వాటి మధ్య ఇసుక వెళ్లడానికి తన తోక, ఒంటితో ఇసుకను రాళ్ల మధ్యలోకి తోస్తుంది. అది చూసిన శ్రీ రాముడు ఉడుత భక్తిని మెచ్చుకుని తన చేతుల్లోకి తీసుకొని చిన్న దానివైనా సాయం చేయాలనే నీ గుణం మంచిది అని తన చేతితో ఉడుతను నెమురుతాడు. ఇప్పుడు ఆ చారలే ఉడుతకు ఉన్నాయని అందరూ చెప్పుకుంటారు. దీన్నే ఉడుత భక్తి అంటారు.