Woman Tries to Kiss AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా పరవాడలో శనివారం పర్యటించారు. ఆ జిల్లాలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో సీఎంకు ఓ అనూహ్య సంఘటన ఎదురైంది. ఓ మహిళ చంద్రబాబుకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా, ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సెక్యూరిటీని తప్పించుకుని సీఎం వద్దకు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జడ్ ప్లస్ భద్రతలో ఉండే సీఎం దగ్గరకు వెళ్లడమంటే మామూలు విషయం కాదు. కానీ ఓ మహిళా అభిమాని మాత్రం ఎలాగైనా తమ అభిమాన నేత చంద్రబాబును కలవాలనుకుని దృఢంగా నిశ్చయించుకుంది. ఈ క్రమంలో అనకాపల్లి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు చుట్టూ ఉన్న సెక్యూరిటీని తప్పించుకుని సీఎం వద్దకు వెళ్లారు.
ఆమె అభిమానాన్ని చూసి చంద్రబాబు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. తొలుత సీఎం భద్రతా సిబ్బంది మహిళను వారించే ప్రయత్నం చేసినా, చంద్రబాబు మాత్రం ఆ మహిళను దగ్గరకు తీసుకొని అప్యాయంగా పలకరించారు. ఆమె తమ అభిమాన నేతకు ఎంతో ఆనందంగా పుష్ఫగుచ్చాన్ని అందించింది. అయితే ఆమె అంతటితో ఆగలేదు.. చంద్రబాబును పట్టుకుని ఆయనకు ముద్దు పెట్టే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించి, ముందుకు సాగారు.
సంక్రాంతి పండుగ నాటికి గుంతల్లేని రోడ్లు : అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం వెన్నెలపాలెంలో రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ, రోడ్లు నాగరికతకు చిహ్నమని, అలాంటి రోడ్లను గత పాలకులు నరకానికి దారులుగా మార్చారని ధ్వజమెత్తారు. వారు మిగిల్చిన ఈ విధ్వంసాన్ని పూడ్చే బాధ్యతను తాము తీసుకున్నట్లు వివరించారు. వచ్చే సంక్రాంతి పండుగ నాటికి గుంతల్లేని రోడ్లుగా అభివృద్ధి చేసి తీరతామని స్పష్టం చేశారు. సంపద సృష్టించాలంటే రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్ల విలువైన నేషనల్ హైవేలను నిర్మించబోతున్నామన్నారు. ఇందులో అమరావతి ఓఆర్ఆర్, కుప్పం- బెంగళూరు రోడ్డు, భోగాపురం, మూలపేట వంటి ప్రధాన రోడ్లు ఉన్నాయని తెలిపారు. వాటిలో రూ.76 వేల కోట్ల పనులు వచ్చే రెండున్నరేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
టీ తయారుచేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు - ఆ దృశ్యాలు మీరూ చూడండి