Wings India Presentation in Hyderabad 2024 : హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్ ఇండియా- 2024 ప్రదర్శనకు సందర్శకులు పోటెత్తారు. దేశ, విదేశాలకు చెందిన విహంగాలను చూసి పర్యాటకులు పరవశించిపోయారు. బోయింగ్, ఎయిర్ ఇండియాతో పాటు పలు సంస్థలు అందుబాటులో ఉంచిన విమానాలను చూసేందుకు వచ్చిన వారితో బేగంపేట్ ఎయిర్‌పోర్టు(Aviation Show at Begumpet Airport) సందడిగా మారింది. పెద్ద విమానాలు, హెలికాఫ్టర్లను చూడటం మరిచిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు.
వింగ్స్ ఇండియా ప్రదర్శనకు నేడు, రేపు సందర్శకులకు అనుమతి - పెరిగిన తాకిడి
Wings India Presentation Response in Hyderabad: హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్టులో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన ప్రజలను మంత్రముగ్దులను చేస్తోంది. సాధారణ ప్రజానీకానికి రెండురోజుల పాటు అనుమతివ్వడంతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం సందర్శకులతో కళకళలాడింది. విద్యార్థులు, యువత, చిన్నా, పెద్దా అశేషంగా తరలివచ్చారు. బోయింగ్‌కు చెందిన ఎయిర్‌బస్, ఎయిరిండియా తదితర సంస్థలకు చెందిన విహంగాలను చూసి అబ్బురపడ్డారు. విమానాలు, హెలికాఫ్టర్లతో చేసిన విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయని ఆనంద వ్యక్తం చేశారు.
Aviation Show 2024 in Hyderabad : ఫోటోలు, వీడియోలతో సందర్శకులు సందడి చేశారు. వివిధ దేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లను చూసి మధురానుభూతికి లోనయ్యారు. పొగలు కక్కుకుంటూ నింగిలో విహంగాలను చూసి ఔరా అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. బోయింగ్‌కు చెందిన ఎయిర్‌బస్ లోపల ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. విమానం సీట్లలో కూర్చుని ఫోటోలు, సెల్పీలు తీసుకున్నారు. వింగ్స్ ఇండియా- 2024(Wings India 2024) ప్రదర్శనలోని వివిధ రకాల విమానాలను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఏవియేషన్ షోలో భాగంగా మొదటి రెండు రోజులు బిజినెస్ పాస్‌లు కలిగిన వారిని మాత్రమే అనుమతించగా శని, ఆదివారాల్లో సామాన్య సందర్శకులకు ప్రవేశం కల్పించారు.
"నేను ఈ ప్రదర్శనకు మొదటిసారి వచ్చాను. చాలా బాగుంది. విమానాల విన్యాసాలను చూడడం ఆనందంగా ఉంది. చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు.బోయింగ్, ఎయిర్ క్రాప్ట్స్, ఎయిర్ బస్, తదితర వాటిని ప్రత్యక్షం చూడడం బాగుంది. ఇలాంటి షోలు పెట్టడం సంతోషం."- సందర్శకుడు
Wings India 2024 Details : 4 రోజులు జరిగే వింగ్స్ ఇండియా-2024 విమానాల ప్రదర్శనను గురువారం నాడు కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో సుమారు 106 దేశాలకు చెందిన 1500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్యాసింజర్, కమర్షియల్ విమానాలతో పాటు ప్రత్యేక ప్రైవేటు లోహవిహంగాలు కూడా ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. 2 సంవత్సరాలకు ఓసారి జరిగే వింగ్స్ విండియా ప్రదర్శన 4 రోజుల పాటు కొనసాతుంది. 2 రోజుల్లో అంతర్జాతీయ స్థాయికి చెందిన వివిధ సంస్థలతో ఇక్కడ వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.