AP Wine Shop Tenders 2024 : ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఆ రాష్ట్ర సర్కార్ రెండురోజులు పొడిగించింది. మొదట జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ గడువు బుధవారంతో ముగియనుంది. అర్జీదారుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకూ గడువు పెంచారు. ఈ నేపథ్యంలో 11వ తేదీకి బదులుగా 14న లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేస్తారు. 16వ తేదీ నుంచి కొత్త లైసెన్సుదారులు దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. అదేరోజు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు.
మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ ఇవ్వగా మంగళవారం రాత్రి 9 గంటల వరకూ 41,348 దరఖాస్తులు అందాయి. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.826.96 కోట్ల ఆదాయం వచ్చింది. గడువు పొడిగిస్తున్న నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతి, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో నోటిఫై చేసిన దుకాణాల సంఖ్యతో పోలిస్తే వచ్చిన దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉంది.
AP Govt Extend Liquor Tenders Dates : మరోవైపు మద్యం దుకాణాల లైసెన్సుల కోసం అర్జీ చేసుకునే వారు ఆఫ్‌లైన్ విధానంలో నాన్ రీఫండ్‌బుల్ రుసుములు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.2 లక్షల దరఖాస్తు రుసుముకు సంబంధించి దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకులో తీసిన డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)నైనా అంగీకరిస్తామని పేర్కొంది. గ్రామీణ బ్యాంకుల్లో డీడీలు తీస్తే మాత్రం అవి రాష్ట్ర పరిధిలోని బ్యాంకులే అయి ఉండాలని స్పష్టం చేసింది.
సీఎఫ్‌ఎంఎస్ నుంచి కూడా చలానా తీసుకోవచ్చని ప్రభుత్వం వివరించింది. ఈ చలానాలు, డీడీల ఒరిజినల్‌ను సంబంధిత కార్యాలయంలో సమర్పించాలని సూచనలు చేసింది. పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఎక్సైజ్ స్టేషన్‌లలో సంప్రదించాలని పేర్కొంది. అక్కడ చలానా లేదా డీడీ సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది.
మద్యం దుకాణాల టెండర్ల అప్డేట్ - 20 వేలు దాటిన దరఖాస్తులు - మరో 2 రోజులే గడువు
'మాకు షేర్ ఇవ్వండి - లేదా పోటీ నుంచి తప్పుకోండి' - Wine Shop Tenders 2024