Wife Kills Husband With Sister and Friend : ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన కేసుకు సంబంధించి నెలకొన్న మిస్టరీని ఏడాది తర్వాత కుల్సుంపురా పోలీసులు ఛేదించారు. మృతుడు ప్రమాదవశాత్తు మరణించలేదని అతడి భార్య, ఆమె సోదరి, స్నేహితురాలు కలిసి హత్య చేసి ఫిట్స్‌తో మృతిచెందినట్లుగా చిత్రీకరించారని ఎట్టకేలకు పోలీసులు నిర్ధారించారు. ఏడాది కిందట జరిగిన అనుమానాస్పద మృతి కేసు హత్యగా తేలిన నేపథ్యంలో శుక్రవారం విచారణ అధికారులు ఇన్‌స్పెక్టర్ సునీల్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌వర్మ, ఎస్‌ఐ కృష్ణవేణి కేసు వివరాలను వెల్లడించారు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమన్(35), కృష్ణవేణి భార్యాభర్తలు. వీరిద్దరూ కార్వాన్ హనుమాన్ కాలనీలో నివాసం ఉంటారు. భర్త డోలు వాయిద్యకారుడుగా పనిచేసేవాడు. భార్య స్థానికంగా ఓ ఆస్పత్రిలో హౌస్‌కీపింగ్ పనులు చేస్తుంటుంది. భర్త మద్యానికి బానిసవ్వడంతో ఆ దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. వారి ఇంటికి పక్కనే కృష్ణవేణి సోదరి యశోద ఒంటరిగా నివాసం ఉంటుంది.
హాస్పిటల్‌లోని సెక్యూరిటీ గార్డు ప్రశాంతితో కృష్ణవేణికి స్నేహం ఏర్పడింది. సెప్టెంబరు 14, 2023న సుమన్ మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. కొంతసేపటికి అతడి భార్యతో పాటు వదిన, స్నేహితురాలు ఇంటికి చేరుకున్నారు. అంతా కలిసి ఎక్కడికి వెళ్లారు అంటూ సుమన్ వారిని దూషించాడు. అక్క, స్నేహితురాలిని తిడతావా? అంటూ భార్య భర్తను పక్కకు తోసేసింది. ముగ్గురు కలిసి ఇనుప రాడ్డుతో అతడిని గాయపరిచారు. అంతటితో ఆగకుండా వస్త్రంతో గొంతు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఘటనా స్థలంలోని ఆధారాలను చెరిపేసిన అనంతరం మృతదేహాన్ని ఉస్మానియాకి తీసుకెళ్లారు. అతడు అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేయగా తాగి కింద పడ్డాడన్నారు. మృతుడి సోదరుడు వారిపై అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు. నాలుగు మాసాలకు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. హత్య జరిగినట్లుగా ప్రాథమిక వివరాలు వెల్లడయ్యాయి. నిందితులను పోలీసులు విచారిస్తే హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
ఒంటరి మహిళలే ఆ 'సీరియల్ కిల్లర్' టార్గెట్ - కనిపిస్తే దోపిడీ, హత్య - చివరకు?
భూమి, కులాంతర వివాహం కోసమే చంపేశారు - కానిస్టేబుల్ హత్య కేసులో తమ్ముడి అరెస్ట్